More

  హైదరాబాద్ లో పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర.. ఎన్ఐఏ ఛార్జిషీటులో విస్తుపోయే వాస్తవాలు..!

  దేశంలో ఉగ్రవాదులు చాపకింద నీరులా విస్తరిస్తున్నారు. దేశంలో వారి కుట్రలను ఎప్పటికప్పుడు పోలీసులు భగ్నం చేస్తూనే ఉన్నారు. ఐతే గతేడాది హైదరాబాద్‌ లో వరుస పేలుళ్లకు పాల్పడాలనే పన్నాగం వెనుక లష్కరే తోయిబా ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. గత ఏడాది దసరా పండుగ రోజు హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులు మహ్మద్‌ అబ్దుల్‌ వాజిద్‌ అలియాస్‌ జాహెద్‌, సమీయుద్దీన్‌ అలియాస్‌ సమీ, మాజ్‌ హసన్‌ ఫరూఖ్‌ అలియాస్‌ మాజ్‌‌లు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా నాయకుడు ఫర్హతుల్లా ఘోరీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

  లష్కరేకే తోయిబాకు చెందిన సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్‌ అలియాస్‌ అబూ హంజాలా, అబ్దుల్‌ మాజిద్‌ అలియాస్‌ చోటు‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఇతర నేతలు, నిర్వాహకులతోనూ నిందితులకు సంబంధాలున్నాయని ఎన్‌ఐఏ తెలిపింది. నిందితులంతా కలిసి హైదరాబాద్‌లోని రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. గత ఏడాది దసరా పండుగ రోజున ఉగ్రవాదులు పన్నిన కుట్ర పథకాన్ని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భగ్నం చేశారు. ఈ ఏడాది జనవరిలో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన సంస్థ నాంపల్లిలోని ఎన్‌ఐఏ న్యాయస్థానంలో ఇటీవల ఛార్జిషీటు దాఖలు చేసింది.

  ఇక నిందితులు ముగ్గురూ లష్కరే తోయిబాతో సంబంధాలు ఏర్పరచుకున్నారని గుర్తించారు. లష్కరే నేతలు ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖ్‌ బిన్‌ ఉస్మాన్‌, అబ్దుల్‌ మాజిద్‌లు పాకిస్థాన్ పౌరులు. ఘోరీ తన కుట్ర కోసం ఇంటర్నెట్‌లో పరిచయమైన జాహెద్‌ను నియమించి హవాలా ద్వారా నిధులు పంపేవాడు. వాటితో లష్కరే సంస్థలో మరింత మందిని నియమించి ఉగ్రవాద కార్యకలాపాలు వేగవంతం చేయాలని చెప్పాడు. ఐతే ఆ ముగ్గురిని లష్కరే కోసం పని చేసేలా మార్చాడు.

  పేలుళ్ల కుట్రలో భాగంగా హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిలోని మనోహరాబాద్‌ గ్రామ సమీపంలో గతేడాది సెప్టెంబరు 28న డెడ్‌ డ్రాప్‌ విధానంలో నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్లను ఉంచారు. సమీ ద్వారా హ్యాండ్‌ గ్రనేడ్లను జాహెద్‌ తెప్పించుకున్నాడు. వాటిని సమీ, మాజ్‌లకు చెరొకటి ఇచ్చాడని దర్యాప్తులో వెల్లడైంది. లష్కరే నేతల సూచన ప్రకారం దసరా రోజున భారీఎత్తున జనం గుమిగూడే ప్రాంతాల్లో వాటిని విసరాలని నిందితులు ఇద్దరికీ సూచించారు. ఈ కుట్రపై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దానిని భగ్నం చేశారు. నిందితుల నివాసాల నుంచి నాలుగు గ్రనేడ్లు, జాహెద్‌ నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీటులో వెల్లడించింది. ఈ ఛార్జిషీటుతో హైదరాబాద్ పై జరిగిన కుట్రలు వెలుగులోకి వచ్చాయి.

  Trending Stories

  Related Stories