జమ్మూ కాశ్మీర్ లోని 14 చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహించింది. జమ్మూ లో ఇటీవల డ్రోన్ల దాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఎన్.ఐ.ఏ. 14 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. రెండు కేసులకు సంబంధించిన ఆ తనిఖీలు జరుగుతున్నాయి. జమ్మూ ఎయిర్‌పోర్ట్ వద్ద ఉన్న ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై కొన్ని వారాల క్రితం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఉగ్రవాద సంస్థ లష్కరే ముస్తఫాకు చెందిన మరో కేసులోనూ ఎన్.ఐ.ఏ. సోదాలు నిర్వహిస్తోంది. సోఫియాన్, అనంతనాగ్, బనిహల్‌తో పాటు సుంజవాన్ లో ఎన్.ఐ.ఏ. అధికారులు సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు.
జూన్ 27 న, జమ్మూలోని నర్వాల్ ప్రాంతం నుండి ఇద్దరు వ్యక్తులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. షోపియాన్ మరియు బనివాల్ నివాసితులైన నదీమ్ అయూబ్ రథర్, తాలిబ్ ఉర్ రెహ్మాన్ లను పోలీసులు అరెస్టు చేశారు. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లోని హై సెక్యూరిటీ ప్రాంతంలో రెండు పేలుళ్లు సంభవించిన కొన్ని గంటల తర్వాత వారి అరెస్టు జరిగింది.విచారణలో మరో ఇద్దరు ఉగ్రవాదుల పేర్లను నదీమ్ వెల్లడించాడు. నిందితుడు జమ్మూలోని ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకోని పేలుళ్లకు పాల్పడ్డాలని భావించారు. కానీ అది వీలు పడలేదు. హోం మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం ఈ కేసుల దర్యాప్తును ఎన్.ఐ.ఏ. కి అప్పగించింది. కాశ్మీర్ లోయలో జైషే మొహమ్మద్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ అయిన లష్కరే ముస్తఫా చీఫ్ హిదయతుల్లా మాలిక్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 న జమ్మూ లో అరెస్టు చేశారు. ఎన్.ఐ.ఏ. ప్రకారం, జమ్మూ కాశ్మీర్‌లో భారీ దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
ఆగస్టు నెలలో పేలుళ్లకు కుట్ర:
ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా, జైష్-ఇ-మొహమ్మద్ జమ్మూ కాశ్మీర్‌లోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. నివేదికల ప్రకారం, ఆగస్టు 5 న మరియు స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 న హిందూ దేవాలయాలపై దాడి చేయవచ్చని నిఘా సంస్థలకు సమాచారం అందింది. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత పెంచేశారు. ఢిల్లీపై కూడా ఉగ్రదాడి చేయడానికి పెద్ద ఎత్తున తీవ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఉగ్రదాడి జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఢిల్లీ పోలీసులకు ఆగస్టు 15 కు ముందే దాడి జరగొచ్చనే విషయమై భద్రతా సంస్థల నుండి సమాచారం అందింది. ఢిల్లీపై డ్రోన్ దాడులు జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి.