తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతి, గడ్చిరోలి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులతో లింకులపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లోని నాగోల్‌లో రవి వర్మ, భవానీ ఇళ్లతో పాటు విశాఖలోని అన్నపూర్ణ నివాసం, ప్రకాశంలోని ఆలకూరపాడులో తనిఖీలు చేట్టారు. ముఖ్యంగా విరసం నేత కల్యాణ్ రావు ఇంట్లో సోదాలు చేయడమే కాకుండా.. ఆయనపై ప్రశ్నలు గుప్పించారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే కు కల్యాణ్ రావు బంధువు కావడంతో అధికారులు ఆయనను విచారించారు. వీరి ఇళ్లలో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రచురణపై కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. ఎన్‌ఐఏ పేరుతో ఉన్న జాకెట్లను ధరించి వచ్చారు అధికారులు. కల్యాణ్ రావు డాబా పైభాగాన్ని కూడా పరిశీలించారు ఎన్‌ఐఏ ప్రత్యేక అధికారి. విశాఖలోని అన్నపూర్ణ నివాసంలోనూ తనిఖీలు చేపట్టారు ఎన్‌ఐఏ అధికారులు. మావోయిస్టులతో సంబంధాలపై ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం నాగోల్‌లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ మాజీ మావోయిస్ట్ రవితో పాటు అనురాధ ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసి లొంగిపోయాడు రవిశర్మ. ఇక అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో అమరవీరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఎన్‌ఐఏ అధికారులు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లతో పాటు పుస్తకాలను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో అమరుల బంధుమిత్రుల సంఘం సహాయ కార్యదర్శి భవాని ఇంటికి పోలీసులు వెళ్లారు.. హైదరాబాద్‌లో ప్రముఖ రచయితలు, అనువాదకులు బి. అనూరాధ, ఎన్. రవి దంపతుల ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
నవంబరు 14న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర పోలీసులు 27 మంది నక్సల్స్‌ను ఎన్ కౌంటర్‌లో హతమార్చారు. చనిపోయినవారిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్(ఎంఎంసీ) జోన్‌లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్లు, విస్తరణ బాధ్యతలు చూస్తున్న మిలింద్ తేల్తుంబ్డే అలియాస్ జీవా అలియాస్ దీపక్ తేల్తుంబ్డేతోపాటు కీలక నేతలు, మహిళలూ ఉన్నారు.