More

    కోయంబత్తూరు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎంట్రీ

    కోయంబత్తూరు పేలుళ్ల కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ)కు అప్పగించాలని కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. విద్రోహ కుట్రలను భగ్నం చేసేందుకు, తన నిఘా విభాగాన్ని పటిష్టం చేసేందుకు ఒక ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

    బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కోయంబత్తూరు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు తాజా పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించేందుకు ఒక ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కోయంబత్తూరులో ఈనెల 23న జరిగిన పేలుడులో ఒక వ్యక్తి మరణించాడు. మృతుని ఇంట్లో జరిపిన సోదాల్లో 75 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశంలో నిర్ణయించారు.

    ఈ పేలుడు కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం కేసు నమోదు చేశారు. కోయంబత్తూరులో కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం వద్ద ఆదివారం ఓ మారుతి 800 కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో జమేజా ముబిన్ (25) ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, ఐదుగురిని మంగళవారం అరెస్టు చేశారు. ముబిన్ ఇంట్లో నుంచి ఓ గ్యాస్ సిలిండర్‌ను గోనె సంచీలో పెట్టి కారు వద్దకు వీరంతా కలిసి తీసుకొచ్చినట్లు గుర్తించారు. కారులోని గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటల్లో చిక్కుకుని ముబిన్ మరణించగా, మహమ్మద్ డల్గా, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రియాస్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహమ్మద్ అనస్ ఇస్మాయిల్‌లను అరెస్టు చేశారు. వీరిపై యూఏపీఏ ప్రకారం కేసు నమోదు చేశారు. కోర్టు వీరిని 15 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఇది సాధారణ గ్యాస్ సిలిండర్ పేలుడు కాదని, ఇది ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం కలిగిన ఉగ్రవాద దాడి అని బీజేపీ నేతలు ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు.

    Trending Stories

    Related Stories