More

    ఆంటిలియా బాంబు బెదిరింపులు.. ప్రదీప్ శర్మ అరెస్టు

    ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నివాసం ‘ఆంటిలియా’ బాంబు కేసు విషయమై ముంబై మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గురువారం అరెస్టు చేశారు. ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు మాజీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్, శివసేన సభ్యుడు ప్రదీప్ శర్మతో పాటు మరో ఇద్దరిని జూన్ 28 వరకు జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి ఇచ్చింది. దక్షిణ ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు నిండిన కారు, వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ ను చంపిన కుట్రలో శర్మ పాల్గొన్నట్లు ఎన్ఐఏ వాదించింది.

    మన్సుఖ్ హిరాన్ మర్డర్ కేసులో ప్రదీప్ శర్మ ప్రమేయం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ కేసులో ముంబై మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఇప్పటికే అరెస్టు చేశారు. వాజే -ప్రదీప్ శర్మ ఇద్దరూ మంచి స్నేహితులని తెలిసింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అయిన ప్రదీప్ శర్మను గతంలో రెండు సార్లు ఎన్ఐఏ విచారించింది. 1983 లో ముంబై పోలీసు శాఖలో ఎస్ఐగా జాయిన్ అయ్యారు. మహారాష్ట్ర పోలీస్ వర్గాల్లో ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న ప్రదీప్‌ శర్మపై 2006లో లఖన్‌ భయ్యా ఎన్‌కౌంటర్, ఈ ఘటనలో దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు సాయం చేశారన్న ఆరోపణలు రావటంతో వేటు పడింది. 2017లో తిరిగి విధుల్లో చేరిన ప్రదీప్ శర్మ 2019లో పోలీసు ఉద్యోగాన్ని వదిలేశారు. 2019 లో సర్వీసు నుంచి రిటైర్మెంట్ తీసుకున్న శర్మ.. శివసేన పార్టీలో చేరి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నాలా సోపర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరికొందరు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఈయనను అధికారులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ స‌చిన్ వాజేకు, శ‌ర్మ గురువుగా చెబుతుంటారు. మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    Trending Stories

    Related Stories