National

ఇదీ బెంగాల్ లో పరిస్థితి.. మానవ హక్కుల సంఘంపై కూడా దాడి

ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న హింస గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన కుటుంబాలపై దాడులు జరగడమే కాకుండా.. చిత్ర హింసలు పెట్టి.. సొంత ఊళ్లు వదిలి వెళ్లిపోయేలా చేశారు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు..! ఈ షాకింగ్ ఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండడంతో ‘జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)’తో విచారణ జరిపించాలనే డిమాండ్లు వినిపించాయి. దీంతో ప్రస్తుతం మానవ హక్కుల సంఘం బెంగాల్ లో పర్యటించి బాధితుల కష్టాలను తెలుసుకోవాలని భావిస్తోంది. అయితే హింసపై దర్యాప్తు జరిపేందుకు వెళ్లిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులపై కొందరు దాడి చేశారు. జాదవ్‌పూర్‌లో కొంతమంది అల్లరిమూకలు తమపై దాడి చేశారని ఓ ఎన్‌హెచ్‌ఆర్‌సీ అధికారి తెలిపినట్లు జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.

పోల్ అనంతర హింసపై దర్యాప్తు కోసం జాదవ్‌పూర్ సందర్శించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందంపై దాడి జరిగింది. “దర్యాప్తులో ఇక్కడ 40 కి పైగా ఇళ్ళు ధ్వంసమైనట్లు కనుగొనబడింది. అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే మాపై గూండాలు దాడి చేస్తున్నారు ”అని ఎన్‌హెచ్‌ఆర్‌సి అధికారి చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరపాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోల్‌కతా హైకోర్టు జూన్‌ 18న ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వారు బాధితులతో మాట్లాడేందుకు నేడు జాదవ్‌పూర్‌ వెళ్లారు. దర్యాప్తులో 40 ఇళ్లు దగ్ధమైనట్లు తాము గుర్తించామని అధికారి చెప్పారు.. మరింత సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా గూండాలు దాడులు చేశారని ఆయన తెలిపారు.

బెంగాల్ లో హిందువుల మీద, బీజేపీ నాయకుల మీద జరుగుతున్న దాడులను మొదటి నుండి బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందంపై చోటు చేసుకున్న దాడులను రౌడీయిజంగా అభివర్ణించింది. ఇది సిగ్గుమాలిన చర్య అని.. బెంగాల్‌లో ఏం జరుగుతోందో తెలిసిపోతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పర్యటనకు రాలేదని కోర్టు ఆదేశాల మేరకే వచ్చిందని తెలిపారు.

అధికార తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసలు దాడే జరగలేదని చెబుతూ ఉంది. తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా మాట్లాడుతూ.. జాతీయ సంస్థల తరపున వచ్చిన ఏ ఒక్కరిపైనా దాడి జరగలేదు. ప్రజలు ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందంపై ఎందుకు దాడి చేస్తారు? బెంగాల్‌ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలపై పెద్ద దాడి చేశారు అని చెప్పారు.

బెంగాల్ హింస:

ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసలో రెండు డజన్లకు పైగా బీజేపీ కార్యకర్తలు చంపబడ్డారు. గ్రూప్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ అండ్ అకాడెమిషియన్స్ (జిఐఎ) సమర్పించిన నివేదికలో బీజేపీకి ఓటు వేసినందుకు హిందూ సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందినవారిని ఎన్నికలలో విజయం సాధించిన తరువాత టిఎంసి కార్యకర్తలు దారుణంగా హింసించారు. ఎంతో మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. ఇళ్ళు దోచుకోబడ్డాయి, దుకాణాలను కొల్లగొట్టారు. అనేక హిందూ కుటుంబాలు తృణమూల్ కాంగ్రెస్ గూండాల నుండి తమను తాము రక్షించుకోవడానికి పొరుగు రాష్ట్రాలకు వలస వచ్చాయి. ఎంతో మంది మహిళలు సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాంగ్మూలాలలో తమపై జరిగిన అత్యాచారాలను వెల్లడించారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల తమపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, లైంగిక వేధింపులతో పాటు మరెన్నో దురాగతాలకు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పుడు విచారణకు వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘంపై కూడా దాడులు చోటు చేసుకోవడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − five =

Back to top button