జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక సమర్పించాలని గత ఏడాది డిసెంబరులో రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఇప్పటివరకు ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శాస్త్రీయంగా చర్యలు తీసుకోవడంలేదని.. ఇప్పుడు ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవని స్పష్టం చేసింది. 2019 నివేదికల ప్రకారం తెలంగాణలో 426 మంది విద్యార్థులు బలవన్మరణం చెందినట్టు వివరించింది. వారం రోజుల వ్యవధిలోనే 22 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఏపీలో 383 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ హెచ్చార్సీ పేర్కొంది.
విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ హెచ్చార్సీ ఉభయ రాష్ట్రాల విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరింది. గతేడాది డిసెంబరులో ఇరు రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది. ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కమిషన్ తాజాగా మరోసారి ఆదేశించింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలను హెచ్చరించింది.