రోడ్డు వేయడంలో భారత్ ఖతార్ రికార్డును బద్దలు కొట్టింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ జాతీయ రహదారి నిర్మాణం ఐదు రోజుల్లోనే పూర్తయింది. అంతకుముందు ఖతార్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ విభాగాన్ని ప్రైవేట్ కాంట్రాక్టర్ ‘రాజ్‌పుత్ ఇన్‌ఫ్రాకాన్’ నిర్మించారు. అమరావతి-అకోలా హైవే నిర్మాణం శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై మంగళవారం పూర్తయింది. NH-53 హైవే కోల్‌కతా, రాయ్‌పూర్, నాగ్‌పూర్, అకోలా, ధులే మరియు సూరత్ వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అమరావతి – అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని అతి తక్కువ సమయంలో.. 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. జూన్ 3వ తేదీ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా జూన్ 7 సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన షేర్ చేశారు. “ఈ రికార్డు జాతికి గర్వకారణమని.. 75 కి.మీ పాటు రహదారి పనులను నిరంతరాయంగా కొనసాగించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినందుకు మా టీమ్ NHAI, కన్సల్టెంట్స్, రాజ్‌పత్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ & జగదీష్ కదమ్‌ని” అభినందించారు. రోడ్డు నిర్మాణానికి పగలు రాత్రి కష్టపడి పనిచేసిన ఇంజనీర్లు, కార్మికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి నితిన్ గడ్కరీ.