వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తీర్పులు అమలు చేయకపోవడం వంటి కారణాలతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇటీవలి కాలంలో ఎన్జీటీ పలు రాష్ట్రాలకు భారీ జరిమానాలు విధించింది. మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్లు, పంజాబ్ కు రూ.2,080 కోట్ల జరిమానా విధించింది.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎన్జీటీకి బదిలీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా నోటీసులు పంపగా, ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో 3,800 కోట్ల భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ జరిమానా మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.