More

  కాబోయే రాష్ట్రపతి ఎవరు? గెలుపు గిరిపుత్రికదేనా?
  కమలం వ్యూహమేంటి? ప్రతిపక్షాలకు భంగపాటు తప్పదా?

  పరాజయం పునరావృత్తమైతే…పరిహసించేవారి సంఖ్య పెరుగుతుంది. మన దేశంలో ప్రతిపక్షాలకు మరో భారీ ఓటమి త్వరలోనే ఎదురుకానుంది. భంగపాటు అలవాటైనపుడు దిగ్భ్రాంతి తారసపడదు. రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. దేశ రాజకీయాల్లో కీలక ఘట్టానికి తెర లేచింది. జూలై 18న ఎన్నికకు రంగం సిద్ధమైంది. అదే నెల 24న 15వ రాష్ట్రపతి కొలువుదీరనున్నారు.


  ఇంతకూ కాబోయే రాష్ట్రపతి ఎవరూ? ఎన్డీఏ కూటమి ఎవరిని బరిలోకి దించనుంది? మోదీ, అమిత్ షాల వ్యూహమేంటి? దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు చేతులెత్తేశాయా? దింపుడుగళ్లెం ఆశాలేమైనా పెట్టుకున్నాయా? రాష్ట్రపతి ఎన్నికల్లో కమలం పార్టీ వ్యూహం పారితే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి మార్గం సుగమం కానుందా?
  ఈ ప్రశ్నలే ఇప్పుడు భారత రాజకీయ యవనికపై ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నిస్పృహలోకి జారిపోయింది. ‘చింతన్ శివిర్’లో ఎంత చింత చేసినా లాభం లేదని ఆ పార్టీ పెద్దలకే తెలిసిపోయింది. అందుకే సీనియర్ నేత కపిల్ సిబల్ హస్తం పార్టీకీ గుడ్ బై చెప్పాడు. ‘చింతా కరో, చింతన్ నహీ’ అన్నాడు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతూ సునీల్ జాకఢ్. కాబట్టి ఇక కాంగ్రెస్ కథ కంచికి చేరినట్టే! ప్రాంతీయ పార్టీల సంగతి సరేసరి! వాటి ఐక్యత నీటిమీది రాత.
  కొండను ఢీకొని పొటేలు బుర్రబద్దలు కొట్టుకున్నట్టూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు అలాంటి మూర్ఖపు ప్రయత్నాలు చేసి…ఆశాభంగంతో తన వ్యవసాయ క్షేత్రంలో మౌన వ్రతానికి కూర్చున్నారు. ప్రతివ్యూహానికి కూడా కాలం కలిసిరావాలనే చారిత్రక సత్యాన్ని తలనెరిసిన నేతలు సైతం కొన్నిసార్లు అతివేగంలో మరిచిపోతారు. తెలివైన వాళ్లు భూమిపై ఎంత ఎత్తు ఉంటారో, భూమి లోపల కూడా అంతే లోతు ఉంటారని సామెత. భారతీయ జనతా పార్టీకి ఈ సామెత సరిగ్గా నప్పుతుంది.
  భారతీయ జనతా పార్టీ ఎవరిని రంగంలోకి దింపుతుందో ఊహించడం దాదాపు అసాధ్యం. ప్రఖ్యాత భారత శాస్త్రవేత్త ఏ.పీ.జే అబ్దుల్ కలాంను కమలం పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకుంటుందని ఎవరూ కలలో సైతం అనుకోలేదు. ముస్లీం వ్యతిరేకిగా ముద్రపడిన బీజేపీ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపి, విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2017లో దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతిని చేసి మరోమారు ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.
  జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరిని బరిలోకి దింపనుంది? ఈ సందేహమే కేవలం రాజకీయ వర్గాలనూ…విశ్లేషకులనే కాదు, సామాన్య ప్రజలను సైతం ఉత్కంఠకు గురిచేస్తోంది. అనేక ఊహాగానాలు పచార్లు చేస్తున్నాయి. సురేష్ ప్రభును బరిలోకి దింపనుందనీ, కాదు కాదు ఆదివాసీ అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును రంగంలోకి తేనుందనీ, కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ ను ఎన్నుకునే అవకాశముందనీ, బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ నేత గోపాల్ నారాయణ్ సింగ్ పేరు పరిశీలనలో ఉందనీ, బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రస్తుత కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ ల అభ్యర్థిత్వాన్ని సైతం కొట్టి పారేలేమంటారు ఆ పార్టీలోని సీనియర్ నేతలు. .బ్రాహ్మణ వర్గానికే అగ్రతాంబూలం ఇవ్వాలనుకుంటే దినేశ్ ద్వివేది రంగంలోకి రావచ్చు.
  మొత్తంగా ద్రౌపది ముర్మును ఎన్నుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని హస్తినలోని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అన్ని సమీకరణలూ, వర్గీకరణలూ సరిచూసుకున్న తర్వాత రాష్ట్రపతి పదవి అభ్యర్థిత్వం విషయంలో కమలం పార్టీ పూర్తి స్పష్టతతో ఉన్నట్టూ తెలుస్తోంది.
  అగ్రవర్ణాల నుంచి లేక, మైనారిటీల నుంచి, లేక ఆదివాసీల నుంచి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంలో బీజేపీ ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. చివరి ఎంపిక మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లోనే ఉంటుంది. మునుపటి రాష్ట్రపతి ఎంపిక విషయంలోనూ తుది వరకు ఊహాగానాలకు అవకాశమిచ్చి మోదీ ప్రతిపాదించిన రాంనాథ్ కోవింద్ నే ఎంపిక చేశారు. ఈసారి కూడా ప్రధాని మోదీ, అమిత్ షాల ఎంపికకే ఎన్డీయేలో పూర్తి ప్రాధాన్యం ఉంటుందని పరిశీలకుల అంచనా.
  గురిపెట్టి ఊరుకుంటే చాలదు గురూ…తుపాకీ గుండు పెల్చాలనే ఇటాలియన్ సామెతను మోదీ, షా ల ద్వయం పూర్తిగా ఆచరిస్తుంది కాబట్టి ఈ సారి మరోమారు తమ ప్రాబల్యాన్ని చాటే అవకాశం స్పష్టంగానే కనిపిస్తోంది.
  ప్రస్తుతం, లోక్‌సభలో 3, రాజ్యసభలో 13 ఖాళీలు ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. నాలుగింటిని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీ బలం కూడా పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రెండోసారి అధికారం చేజిక్కించుకున్నప్పటికీ.. సంఖ్య తగ్గింది.
  ఎలక్టోరల్ కాలేజీలో ఇప్పటికే అధికారంలోని ఎన్డీఏకు దాదాపు 50 శాతం ఓట్లు ఉన్నాయని బీజేపీ నేత ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఈ కూటమికి ఏపీలోని జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్‌సీపీ, నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీ వంటి ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతోపాటు కమలం పార్టీ తన కూటమిలోని ఏఐఏడీఎంకే మద్దతు కూడా పొందనుంది.
  మిత్రపక్షాలతో కలుపుకుంటే ఎన్డీఏ బలం 49% శాతం. ఎన్డీయేతర పార్టీల బలం చేరితే అది కాస్త 51% అవుతుంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీతో బీజేపీ అవగాహనకు రావడంతో ఎన్డీఏ బలం 53శాతానికి చేరింది. చిన్నా చితకా పార్టీలు ఎలాగూ మద్దతు ఇస్తాయి కాబట్టి మొత్తంగా ఎన్డీఏ బలం 60 నుంచి 65 శాతానికి చేరుతుంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించడం సునాయాసమంటున్నారు పరిశీలకులు.
  రాష్ట్రపతి కోవింద్ 25 జూలై 2017న పదవీ బాధ్యతలు స్వీకరించారు. NDA రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరు ఖరారు చేసిన సమయంలో రామ్‌నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్‌గా ఉన్నారు. ఈ సమయంలో విపక్షాలు మీరా కుమార్‌ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపాయి. అయితే కోవింద్ 65.65 శాతం ఓట్ల రాగా.. మీరా కుమార్‌కు కేవలం 34.35 శాతం మాత్రమే వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేపీ ముందు నుంచి వ్యూహాలను రచిస్తూ వస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోని 772 మంది సభ్యుల ప్రస్తుత బలంలో బీజేపీకి 392 మంది ఉన్నారు. ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటుకు దాదాపు సగం ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. కాబట్టి ఉభయ సభల్లో బీజేపీ ప్రతిపక్ష సభ్యులతో పోలిస్తే మెజారిటీతో ఉంది.
  ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో నోరుమెదపలేని స్థితిలో ఉంది. ప్రాంతీయ పార్టీ యూపీఏ గొడుకు కిందకు వచ్చేందుకు అయిష్టతను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే, ఎన్సీపీ, జేడీఎస్, జేఎమ్ఎమ్, ఆర్జేడీ, ఎస్పీ పార్టీలు యూపీఏతో ఉండే అవకాశం ఉంది.
  దేవేగౌడ, అన్నాహజారే, శరద్ పవార్ లాంటి పేర్లు వినిపిస్తున్నా…వయసు, ఆరోగ్యం రీత్యా అన్నా హజారే తిరస్కరించే ఛాన్స్ ఉందనీ, దేవెగౌడ ఇప్పటికే తనకు ఆసక్తి లేదని కేసీఆర్ తో చెప్పినట్టూ వార్తలు వస్తున్నాయి. ఒక్క శరద్ పవార్ మాత్రం కొంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టూ కనిపిస్తోంది. ఎన్డీఏ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటే, యూపీఏ అస్పష్టత ప్రదర్శిస్తోంది.
  బీజేపీ అనే బాహుబలిని ఎదిరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలం హడావిడి సృష్టించి తీరా ఎన్నిక దగ్గర పడ్డాక వ్యవసాయ క్షేత్రంలో తపస్సుకు కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు మాత్రం కేసీఆర్ మౌనం దాల్చాడంటే ఏదో అర్థం ఉంటుందంటున్నారు. బహుశా మౌనం సర్వార్థసాధనమని వారి ఉద్దేశం కావచ్చు.
  కేసీఆర్ మాటలో గాంభీర్యం కనిపించింది కానీ, చేతలో విశ్వసనీయత గోచరించలేదు. నిజానికి తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించవనే స్పష్టత కేసీఆర్ వందశాతం ఉంది. అయితే కేసీఆర్ రాజకీయ వ్యక్తిత్వంలో నాటకీయత అనేది అవిభాజ్యమైంది. బహుశా! ఇది వ్యసనం లాంటి బలహీనత కూడా కావచ్చేమో చెప్పలేం! ఈ నాటకీయతే ఆయనకు కొన్ని సార్లు కలిసి వచ్చింది. అనేక మార్లు అభాసుపాలు చేసింది. విడతలుగా రానున్న పది రాష్ట్రాల ఎన్నికలు సైతం కేసీఆర్ సహా దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీలను అభద్రతా భావనకు గురిచేస్తున్నాయి.
  దీనస్థితిలోని ప్రతిపక్షం, ఒక్కతాటిపైకి రాని ప్రాంతీయ పార్టీలు రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేవనే వాస్తవం జీర్ణం కాక, కేసీఆర్, మమత బెనర్జీ లాంటి వారు అసహనానికి గురై తరచూ ప్రెస్ మీట్లలో శాపనార్థాలు పెడుతున్నారు.

  మూడో సారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక సాంస్కృతిక, సామాజిక శక్తి అనే సత్యాన్ని గుర్తిస్తే ప్రతిపక్షాలకు, మరీ ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలకు భవిష్యత్తు కార్యాచరణ మరింత స్పష్టమవుతుంది. మైళ్లు కాకపోయినా నాలుగు అడుగులైనా ముందుకు చూడగలిగితే మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే పతనావస్థ మరింత వేగిరమవుతుంది. మొత్తంగా రాబోయే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు రాష్ట్రపతి ఎన్నిక సూచన ప్రాయమైన సంకేతం కానుంది.
  ఇక చివరగా రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ, తెలంగాణ ఓట్ల వివరాలు చూద్దాం….
  1971 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 2,78,00,586. ఏపీ శాసనసభ సీట్ల సంఖ్య 175. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ…2,78,00,586 ÷ 175. ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని ఎమ్మెల్యేల అందరి ఓటు విలువ 27,825. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825. ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలు 25. రాజ్యసభ స్థానాలు 11. ఈ లెక్కన ఏపీలో మొత్తం ఎంపీల సంఖ్య 36. అంటే వీరందరి ఓటు విలువ మొత్తం 25,488. ఏపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 53,313.
  1972 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 1,57,02,122. రాష్ట్రంలోని మొత్తం శాసనసభ స్థానాలు 119. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 1,57,02,122÷ 119 తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. ఈ లెక్కన తెలంగాణ మొత్తం ఓటు విలువ 15,708. తెలంగాణ లోక్‌సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7. ఈ లెక్కన తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24. వీరందరి ఓటు విలువ 16,992 తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 32,700.
  కాలం అందరికంటే గొప్ప గురువు. కానీ, దానితో వచ్చిన చిక్కేమిటంటే, అది శిశ్యుల్ని చంపేస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ క్రమంగా శిశ్యుల్లాంటి నేతలనూ, పార్టీ శ్రేణులనూ క్రమంగా తనంతకు తానే చంపేసుకుంటోంది. మరోవైపు బీజేపీ నిత్యం కసరత్తు చేస్తూ అమితబలశాలిగా మారుతోంది. సమీప భవిష్యత్తులో కమలం కండబలాన్ని సవాలు చేయగల రాజకీయ మల్లయోధులు ఏ అఖాడాల్లో అయినా తయారు కాగలరా?

  Trending Stories

  Related Stories