ఇంగ్లండ్ జట్టుకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. మొదటి సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ కు ఛేజింగ్ సమయంలో ఆఖరి నాలుగు ఓవర్లలో చుక్కలు చూపించి ఫైనల్ కు దూసుకుపోయింది. ఈజీగా గెలుస్తుందని ఇంగ్లండ్ భావిస్తున్న సమయంలో జిమ్మీ నీషమ్, డారెల్ మిచెల్ లు బౌండరీలతో విరుచుకుపడి.. న్యూజిలాండ్ ను ఫైనల్ కు చేర్చారు. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ను ఓడించింది. ఇంగ్లండ్ విఇచ్చిన167 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ డారెల్ మిచెల్ 47 బంతుల్లోనే 72 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిచెల్ స్కోరులో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి.
టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ (51), డేవిడ్ మలాన్ (41) రాణించారు. లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలోనే చిక్కుల్లో పడింది. 13 పరుగులకే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (4), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) ల వికెట్లు కోల్పోయింది. మరో ఓపెనర్ డారిల్ మిచెల్ మాత్రం క్రీజులో నిలదొక్కుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ డెవాన్ కాన్వే (38 బంతుల్లో 46) అండగా నిలవగా.. ఆఖర్లో జిమ్మీ నీషమ్ (11 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సులు) చెలరేగడంతో మ్యాచ్ కివీస్ చేతుల్లోకి వచ్చేసింది. ఆఖర్లో ఎటువంటి తడబాటు లేకుండా.. మిచెల్ కివీస్ కు విజయాన్ని అందించాడు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.