85 కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్లను తయారు చేయబోతున్నాం.. మరెన్నో వ్యాక్సిన్లు కూడా

0
790

భారతీయులకు వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్లు అందించాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉన్న పలు ఫార్మా కంపెనీలతో చర్చలు జరుపుతోంది కేంద్రం. ఇప్పటికే రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్లను భారత్ కు తెప్పించారు. త్వరలోనే భారత్ లో వ్యాక్సిన్ల తయారీ మొదలు కాబోతోంది. ఇలాంటి సమయంలో ఓ కీలక విషయాన్ని రష్యాలో భారత రాయబారి డి.బి. వెంకటేశ్ వర్మ తెలియజేశారు.

ఇండియాలో 85 కోట్ల స్పుత్నిక్ వీ టీకాలను తయారు చేస్తామని వెంకటేశ్ వర్మ హామీ ఇచ్చారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో స్పుత్నిక్ టీకాలు, భారత్ లో కరోనా పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు నుంచి ఉత్పత్తి మొదలవుతుందని.. ప్రపంచంలో తయారయ్యే స్పుత్నిక్ వ్యాక్సిన్లలో 65 నుంచి 70 శాతం వరకు భారత్ లోనే ఉత్పత్తి అవుతాయని అన్నారు. భారత్ కు రష్యా నుంచి లక్షన్నర డోసులు అందాయని.. మే చివరి నాటికి 30 లక్షల డోసుల ‘బల్క్ వ్యాక్సిన్’ అందుతుందన్నారు. ఆ తర్వాత ఆ సామర్థ్యాన్ని 50 లక్షలకు పెంచుతామని తెలిపారు. మూడు దశల్లో స్పుత్నిక్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. మొదటి దశలో రష్యాలో తయారై అక్కడే సీసాల్లో నింపిన వ్యాక్సిన్ల సరఫరా, బల్క్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చి దేశంలోనే సీసాల్లో నింపి సరఫరా, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ల సరఫరా అని ఆయన వివరించారు. స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ అనే విషయం తెలిసిందే..! స్పుత్నిక్ లైట్ కరోనా వ్యాక్సిన్ కు ఇటీవలే రష్యాలో వినియోగానికి ఆమోదం లభించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను కూడా భారత్ కు తీసుకుని రావడానికి సిద్ధమైంది. భారత్ లో మళ్లీ ప్రత్యేకంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలంటే వ్యాక్సినేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నుంచి మినహాయింపు కోరాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ భావిస్తోంది. కేవలం సాంకేతిక పరిజ్ఞానం బదిలీ మాత్రమేనని.. ఇక్కడ వ్యాక్సిన్ ను మళ్లీ అభివృద్ధి చేయడం ఏమీ ఉండదని ఫార్మా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

స్పుత్నిక్ వ్యాక్సిన్లు మాత్రమే కాకుండా స్వదేశీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాబోతోంది. జైడస్ క్యాడిలా తయారు చేస్తున్న జైకోవ్-డి వ్యాక్సిన్ మే నెలాఖరుకల్లా అనుమతులు పొందనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో వున్న ఈ వ్యాక్సిన్ కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద అనుమతులు మంజూరు చేస్తే.. జైకోవ్-డి వ్యాక్సిన్ దేశంలో అనుమతి పొందిన నాలుగో కొవిడ్ వ్యాక్సిన్ కానుంది. ఏడాదిలోగా 24 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని ఈ సంస్థ చెబుతోంది. దేశంలో ఇప్పుడు అందుబాటులో వున్న మూడు వ్యాక్సిన్లకు ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లయితే.. జైకోవ్-డి మాత్రం డీఎన్ఏ ప్లాస్మిడ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ లో ఎలాంటి జెనెటిక్ మెటీరియల్ వాడలేదు. ప్రస్తుతం అందుబాటులో వున్న వ్యాక్సిన్నీ రెండు డోసుల టీకాలైతే.. జైకోవ్-డి ని మాత్రం మూడు డోసులుగా తీసుకోవాల్సి వుంటుంది. మూడు డోసులు ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి ప్రతిస్పందన ఎక్కువకాలం వుంటుంది. జైకోవ్-డి వ్యాక్సిన్ కు వున్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇస్తారు. అంటే సూది లేకుండానే శరీరంలోకి పంపిస్తారు.

భారత ప్రభుత్వం ఫైజర్ కంపెనీతో కూడా చర్చలు జరుపుతూ ఉంది. టీకా దుష్ప్రభావంతో మరణించిన వారికి ఇచ్చే పరిహారం విషయంలో తమకు కేంద్ర ప్రభుత్వం నుంచే భద్రత కల్పించాలని ఫైజర్ డిమాండ్ చేస్తూ ఉండగా.. దేశంలో ఇప్పటిదాకా ఏ సంస్థకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన భద్రతను ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఫైజర్ సంస్థ మెట్టు దిగడం లేదు. ఇప్పటికే చాలా దేశాల ప్రభుత్వాలు తమకు ఇలాంటి హామీ ఇచ్చాయని ఫైజర్ సంస్థ చెబుతోంది. దీనిపై పరిష్కారం తీసుకు రావడానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ త్వరలోనే అమెరికాకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయ సాయం అందిస్తామని ఫైజర్ యాజమాన్యానికి జైశంకర్ చెప్పనున్నారని తెలుస్తోంది. ఈ చర్చలు కూడా సఫలమైతే ఫైజర్ వ్యాక్సిన్ కూడా భారతీయులకు అందుబాటులోకి వచ్చేసినట్లే..!

Leave A Reply

Please enter your comment!
Please enter your name here