More

    భారత ఆర్మీకి కొత్త యూనిఫామ్.. స్పెషాలిటీ ఏమిటంటే..!

    భారత ఆర్మీకి మరింత తేలికైన, మన్నికైన యూనిఫామ్ ను తీసుకుని వస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి భారత ఆర్మీకి ఈ కొత్త యూనిఫామ్‌ను అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. భారత ఆర్మీ యూనిఫాంలో ఇప్పటి వరకు పెద్దగా మార్పు లేదనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కొత్త యూనిఫాంను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. వేసవి, చలికాలాల్లో మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని తయారుచేశారు. మంచు, అటవీ ప్రాంతాల పరిసరాల రంగుల్లో కలిసిపోయేలా ఉండే రంగులను యూనిఫామ్‌ కోసం ఎంపికచేశారు. బలగాలను కాస్త దూరం నుంచి చూస్తే పసిగట్టకుండా ఉండేందుకు ఆయా రంగుల్లో డిజైన్‌ను ఎంపికచేశారు. ‘డిజిటల్‌ డిస్ట్రర్బ్‌’ డిజైన్‌లో ఈ యూనిఫామ్‌ను రూపొందించారు.

    కొత్త యూనిఫాం రంగు ప్రకృతిలో సులభంగా కలిసిపోయే విధంగా.. ఎలాంటి కాలంలోనైనా సిబ్బందికి అనుకూలంగా ఉండేలా దీనిని డిజైన్​ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా శత్రువులు గుర్తించలేని విధంగా ఈ యూనిఫామ్​ ఉండనుంది. వివిధ రంగుల సమ్మేళనంతో ఈ యూనిఫాం ఉండనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న యూనిఫాంతో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుందని వెల్లడించాయి.

    వచ్చే ఏడాది జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్‌లో తొలిసారిగా అధికారికంగా దీనిని ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సైనికులకు యుద్ధక్షేత్రాల్లో వినియోగిస్తున్న వేర్వేరు డిజైన్‌ల ఆర్మీ యూనిఫామ్‌లను పరిశీలించి, పలు చర్చల అనంతరం ఈ యూనిఫామ్‌కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న యూనిఫాంను పారా మిలిటరీ సిబ్బంది కూడా ధరించడంపై ఆర్మీ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కొత్త యూనిఫాంతో ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. అన్ని రకాలుగా చర్చించిన తర్వాతే కొత్త యూనిఫాంను తీసుకారావాలని నిర్ణయించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. కొత్త కాంబాట్ యూనిఫాం తేలికైన కానీ ధృడమైన పదార్థంతో తయారు చేయబడుతుందని, ఇది వేసవి మరియు చలికాలం రెండింటికీ అనుకూలంగా ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. కొత్త యూనిఫాంలో ప్రస్తుతమున్నట్లు షర్ట్స్ టకింగ్ చేయడం కూడా ఉండదని తెలిపాయి.

    Trending Stories

    Related Stories