సరోగసీతో కవలలకు జన్మనిచ్చి, విమర్శలు ఎదుర్కొంటున్న నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు ఊహించని ప్రకటన చేశారు. పెళ్లయిన నాలుగు నెలలకే వీరు తల్లిదండ్రులయ్యారని.. పెళ్లికి ముందే వేరొక మహిళ గర్భాన్ని అద్దెకు ఎలా తీసుకుంటారనే దానిపై విచారణకు తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీని సైతం నియమించింది. ప్రపంచానికి తెలియకుండా దాచి పెట్టిన నయన్ దంపతులు ఎట్టకేలకు దాన్ని బయటపెట్టారు. తమ వివాహాన్ని ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకున్నట్టు అఫిడవిట్ సమర్పించారు. తమిళనాడు వైద్య శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి తమ వివాహ సర్టిఫికెట్, అఫిడవిట్ ను విఘ్నేశ్, నయన్ సమర్పించినట్టు తెలిసింది. తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖకు ఇచ్చిన అఫిడవిట్ లో నయనతార దంపతులు కీలక విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇండియాలో సరోగసీ ద్వారా తాము పిల్లలను కనలేదని… యూఏఈలో ఉన్న తమ బంధువైన మహిళ గర్భం ద్వారా పిల్లలను కన్నామని చెప్పినట్టు సమాచారం. నయనతార జంట ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విఘ్నేశ్, నయనతార 2015 నుంచి ప్రేమించుకుంటూ, సహ జీవనం కూడా చేశారు. అక్టోబర్ 9న కవలలకు తల్లిదండ్రులయ్యారు. సరోగసీ చట్టం ప్రకారం పెళ్లయి ఐదేళ్ల వరకు పిల్లలు లేకపోతేనే ఈ విధానానికి అర్హులు. సరోగసీ ద్వారా పిల్లలను కని పెట్టడానికి ముందుకు వచ్చే మహిళ వారి బంధువు అయి ఉండాలి. పైగా అప్పటికే ఆ మహిళకు ఒక్కరు అయినా సంతానం ఉండాలి. సరోగసీ ద్వారా పిల్లలను కనడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పును వెలువరించింది. విధిలేని పరిస్థితుల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అది కూడా ప్రభుత్వ అనుమతితో మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలను కనొచ్చు.