More

    ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్.. దశ తిరిగేనా..?

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. పార్టీకి ఇప్పట్లో పునర్వైభవం వస్తుందన్న ఆశ కూడా లేదు. ఇలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ కు కొత్త చీఫ్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తప్పించి ఆయన స్థానంలో గిడుగు రుద్రరాజును నియమించారు. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని అధిష్ఠానం నియమించింది. మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, పి.రాజేశ్‌లను కార్య నిర్వాహక అధ్యక్షులుగా నియమించిన అధిష్ఠానం, హర్షకుమార్‌ను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. మరో సీనియర్ నేత తులసిరెడ్డి మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు.

    ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజుకు సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరుంది. కాంగ్రెస్‌తో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉన్న ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కూడా. తనను ఏపీసీసీ చీఫ్‌గా నియమించడంపై రుద్రరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతింది. ఆ పార్టీని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందన్న నమ్మకం కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో లేదు.

    Trending Stories

    Related Stories