‘మౌకా మౌకా’ యాడ్ ను భారత్-పాక్ క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేరు. పాకిస్తాన్ ఇప్పటి వరకూ వరల్డ్ కప్ లో ఎప్పుడూ భారత్ మీద గెలవలేదు. దీంతో ప్రతి ప్రపంచ కప్ ముందు భారత్ ను పాక్ ఓడించే అవకాశం ఉందంటూ చెబుతుంటారు. కానీ మ్యాచ్ లలో మాత్రం భారత్ విజయం అందుకుంటూనే ఉంది. ఎప్పటికైనా ప్రపంచ కప్ లో భారత్ పై పాక్ గెలుస్తుందని.. టపాసులు కాల్చాలని పాక్ అభిమాని ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటాడు. అయితే పాక్ ఓడిపోవడం.. టీవీలను పగులగొట్టడం జరుగుతూనే ఉంది.
ఇంకొద్ది రోజుల్లో ప్రపంచ కప్ మొదలుకాబోతోంది. భారత్-పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉండడం.. రెండు జట్లకు మొదటి మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఎక్కడి లేని క్యూరియాసిటీ మొదలైంది. అక్టోబర్ 24న భారత్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్ లో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ కోసం స్టార్ స్పోర్ట్స్ అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేసింది. మరోసారి మౌకా మౌకా యాడ్ ను తీసుకుని వచ్చింది. టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా ఆ మౌకా మౌకా యాడ్‌లోని పాక్ అభిమాని మళ్లీ పటాకులు పట్టుకొని దుబాయ్ వచ్చాడు. ఈ లేటెస్ట్ యాడ్‌ను బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. కాస్త ఫన్నీగా, ప్రత్యర్థిని సరదాగా ఏడిపించేలా ఈ ప్రోమో రూపొందించారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇండోపాక్ మ్యాచ్ చూడటానికి ఓ పేద్ద టీవీ కొనడానికి తన ఫ్రెండ్ షోరూమ్‌కు టపాసులు పట్టుకొని వస్తాడు ఆ పాక్ అభిమాని. ఈ సందర్భంగా ఆ టీవీ షోరూమ్ ఓనర్.. అతన్ని ఆట పట్టిస్తాడు. ఈసారి పాక్ జట్టులోని ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారని.. భారత్ ను ఓడించడం పక్కా అని చెబుతాడు. భారత్ అభిమాని అతడు చెప్పేది వింటూ ఉంటాడు. ఇక ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద టీవీ కావాలని అడగ్గా.. భారత్ అభిమాని ఒక టీవీ కొంటే మరో టీవీ ఉచితం అని చెబుతాడు. ఎందుకంటే భారత్ తో మ్యాచ్ ఓడిపోగానే ఎలాగూ టీవీని పగులగొడతారు.. దీంతో ఇంకొకటి అయినా ఉంటుందని ఆట పట్టిస్తాడు. అలా మౌకా మౌకా కొత్త యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ యాడ్ తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా యాడ్ పై ఓ లుక్ వేసేయండి. షేర్ కూడా చేయండి.
24న ఇండియా, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఇప్పటివరకూ వన్డే, టీ20 వరల్డ్‌కప్‌లలో ఎప్పుడూ పాక్ చేతిలో ఇండియా ఓడలేదు. టీ20 వరల్డ్‌కప్‌లలో ఐదుసార్లు తలపడగా.. అన్ని మ్యాచ్ లలోనూ భారత్ గెలిచింది. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ పాకిస్తాన్ మీద గెలిచి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇక అప్పటి నుండి భారత్ టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఈసారి మాత్రం అవకాశం వదలకూడదని భారత్ భావిస్తోంది.