భారత్ లో నకిలీ పాస్ పోర్టులకు చెక్.. ఇకపై చిప్ ఉన్న పాస్ పోర్ట్ ను అందించనున్న కేంద్రం

0
736

త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్ పోర్ట్ విధానం తీసుకువస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పాస్ పోర్ట్ లన్నీ ఇకపై మైక్రో చిప్ తో ఎనేబుల్ చేయనున్నారు. ఆయా పాస్ పోర్ట్ హోల్డర్స్ కు సంబంధించిన కీలకమైన సమాచారం ఇందులోనే వుంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేకుండా మైక్రో చిప్ లు తయారుచేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య వెల్లడించారు. సంజయ్ భట్టాచార్య ట్విట్టర్‌లో భారతదేశం త్వరలో సురక్షితమైన బయోమెట్రిక్ డేటాతో ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెడుతుందని ప్రకటించారు. ఈ-పాస్‌పోర్ట్‌లు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. ఎంబెడెడ్ చిప్స్ మరియు ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో వాటిని రూపొందించనున్నట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ-పాస్‌పోర్ట్‌లు ట్యాంపరింగ్, నకిలీ చేయడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా హై సెక్యూరిటీ ప్రమాణాలతో తయారు చేస్తారు. భారతదేశం ప్రస్తుతం వినియోగదారులకు ముద్రించిన పాస్‌పోర్ట్‌లను మాత్రమే అందిస్తోంది.

అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ల వద్ద ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకుని వెళ్లిపోయేందుకు వీలవుతుందని ప్రభుత్వం తెలిపింది. నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ వీటిని తయారు చేస్తోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాయంతో తయారు చేసిన వీటిలోని డేటాను బదిలీ చేసుకోవడానికి వీల్లేదు. ప్రయోగాత్మకంగా 20,000 మంది దౌత్య సిబ్బందికి ఈ-పాస్ పోర్ట్ లను ఇచ్చి చూశారు. పౌరులు అందరికీ దీన్ని త్వరలోనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ పాస్ పోర్టులు జారీ అవుతాయని ఆయన చెబుతున్నారు. ఈ-పాస్‌పోర్ట్‌లు US, UK మరియు జర్మనీతో సహా ఇతర దేశాలలో అందుబాటులో ఉన్నాయి.

అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు అనుగుణంగా నాసిక్‌లోని ‘ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌’ ఈపాస్ పోర్టులను తయారుచేస్తోంది. టాటాకు చెందిన ప్రముఖ కంపెనీ టీసీఎస్‌ ఈ- పాస్ పోర్ట్ తయారీకి కావాల్సిన సాంకేతిక సహకారం అందించనుంది. ఇందులో అమర్చిన మైక్రో చిప్ లో ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ఎన్ కోడ్ చేస్తారు. ఫలితంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ సాయంతో ఇందులోని వ్యక్తిగత డేటాను బదిలీ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. ఒకవేళ ఈ మైక్రో చిప్ ను ట్యాంపర్ చేయడానికి ప్రయత్నించినా సులభంగా గుర్తించవచ్చు. మైక్రోచిప్‌లో పాస్‌పోర్ట్ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ మరియు ఇతర వివరాల వంటి సమాచారం ఉంటుంది. ఈ-పాస్‌పోర్ట్ తో ప్రయాణాల సమయంలో మైగ్రేషన్ కౌంటర్ ముందు పొడవైన క్యూలో నిలబడవలసిన అవసరం ఉండదు. ఈ-పాస్‌పోర్ట్‌ని నిమిషాల్లో స్కాన్ చేసే అవకాశం ఉంటుంది.