More

    చెప్తే వినలేదు.. బ్రిటన్ కు గట్టి షాక్ ఇచ్చిన భారత్

    కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం కొద్దిరోజుల కిందట నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోస్‌ల తీసుకుని తమ దేశానికి వచ్చే ప్రయాణికులను వ్యాక్సిన్ వేసుకోనివారిగానే పరిగణిస్తామని, వీరు 10 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని యూకే ప్రకటించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇది వివక్ష తప్ప మరొకటి కాదని.. ఓవైపు భారత్ లో తయారైన వ్యాక్సిన్ లను వాడుకుంటున్న బ్రిటన్, మరోవైపు అదే వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులపై ఆంక్షలు విధించడం సరికాదని తేల్చి చెప్పింది. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది.

    భారత్ హెచ్చరికలను బ్రిటన్ పట్టించుకోకపోవడంతో అక్టోబర్ 4 నుండి భారతదేశానికి వచ్చే యూకే జాతీయులు టీకాలు వేసుకున్నా.. వేసుకోకపోయినా తప్పనిసరిగా 10 రోజుల పాటూ ఐసోలేషన్ లో ఉండాల్సిందే..! బ్రిటన్ ప్రభుత్వం నియమాలకు బుద్ధి చెప్పాలనే భారతదేశం ఇలా కొత్త నియమాలను తీసుకుని వచ్చింది. అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటి వద్ద/హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులకు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

    వివక్షాపూరితంగా భారతీయులపై క్వారంటైన్‌ ఆంక్షలను విధించిన బ్రిటన్‌కు భారత్‌ ఇలా షాక్‌ ఇచ్చింది. కోవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది బ్రిటన్ సంస్థలేనని, ఇప్పటికే అరకోటి కొవిషీల్డ్ డోసులను బ్రిటన్ కు అందించామని, ఆ వ్యాక్సిన్లకు అక్కడి ప్రజలకు వినియోగించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడదే కొవిషీల్డ్ ను బ్రిటన్ గుర్తించకపోవడాన్ని వివక్షగానే భావిస్తామని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనికా, ఫైజర్-ఎన్ బోటెక్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను మాత్రమే గుర్తిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. భారత్‌లో తయారయ్యే కోవిషీల్డ్ టీకాను గుర్తించడం లేదని నిబంధనల్లో పేర్కొనడం వివాదాస్పదమైంది.

    Related Stories