ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో జగనన్న గోరుముద్ద ఒకటి. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం.. జగనన్న గోరుముద్దలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఒకటి చొప్పున మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులకు కోడిగుడ్డు అందిస్తున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం భోజనంలో అందించే గుడ్డు నాణ్యత లేకపోవడం.. పాడైపోయిన గుడ్లు విద్యార్థులకు పెట్టడం వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై కీలక సూచనలు చేసింది. 10 రోజులకు ఒక్కసారి పాఠశాలలకు సరఫరా చేస్తున్న గుడ్లకు బదులుగా వారానికి ఒకసారి గుడ్లను సరఫరా చేయాల్సిందిగా ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పకడ్బందీగా నాణ్యతతో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి 2020–21లో 1,546 కోట్లు, 2021–22లో 1,797 కోట్లు ఖర్చు పెట్టింది. 2022–23 విద్యాసంవత్సరానికి 1,908 కోట్లు కేటాయించింది. గతంలో ఈ పథకం కింద 32 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈసారి 43.46 లక్షల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం వారానికి ఒక మెనూ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.