ఒడిశాలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నిన్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రులందరినీ రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. 20 మంది మంత్రులతో పాటు.. స్పీకర్ కూడా రాజీనామా చేశారు. నేడు ఒడిశా ప్రభుత్వంలో కొత్తకేబినెట్ కొలువుదీరింది. భువనేశ్వర్ లోని లోక్ సేవ భవన్ న్యూ కన్వెన్షన్ సెంటర్లో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలతో గణేశీ లాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆదివారం ఒడిశా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారిలో ఎస్.జగన్నాథ్, నిరంజన్ పుజారీ, ఆర్పీ స్వాయిన్ ఉన్నారు. కొత్త కేబినెట్ మంత్రుల్లో ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. ప్రమీలా మాలిక్, ఉషా దేవీ, తుకునీ సాహును నవీన్ పట్నాయక్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కాగా.. జగన్ ప్రభుత్వం బాటలోనే నవీన్ పట్నాయక్ కూడా నడుస్తున్నారన్న వార్తలు ఇప్పటికే గుప్పుమన్నాయి. రెండు దశాబ్దాలకు పైగా ఒడిశాకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వమే కొనసాగుతోంది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉండే వ్యతిరేకతను పోగొట్టేందుకే నవీన్ పట్నాయక్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది.