షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘పఠాన్’ జనవరి 25న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన లభిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పలువురు సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్‌ఐకు చెందిన వాళ్లను మంచోళ్ళుగా చూపించినందుకు చిత్ర నిర్మాతలను విమర్శిస్తూ ఉన్నారు.
ఎంతోమంది అమాయక భారతీయుల మరణాలకు పాకిస్తాన్ కు చెందిన ISI కారణం. భారత్ లో మారణహోమం సృష్టించే తీవ్రవాదులకు ఐఎస్ఐ ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. భారతదేశంలో అశాంతికి ఆజ్యం పోస్తూ ఉంటుంది. అలాంటిది ఐఎస్ఐ చాలా మంచిదన్నట్టుగా.. సినిమాలో చూపించారు. ఇండియా టుడే జర్నలిస్ట్ గౌరవ్ సావంత్ ట్వీట్ చేస్తూ.. పాక్ ఐఎస్ఐ బాలీవుడ్ చిత్రాలలో మాత్రమే స్నేహపూర్వకంగా ఉంటుంది. 1993 ముంబై వరుస పేలుళ్ల నుండి 26/11వరకు భారతదేశంలో ఎంతో మంది చావుకు ISI బాధ్యత వహిస్తుందని ఆరోపించారు.
ప్రముఖ ట్విటర్ వినియోగదారు సమీత్ థక్కర్, భారతదేశానికి వ్యతిరేకంగా వైరస్‌ను రూపొందించే విలన్‌గా భారతీయ RAW ఏజెంట్‌ను, భారతదేశానికి సహాయం చేసే పాక్ ISI మహిళా అధికారిని చూపించడంలో మేకర్స్ ఎంతో పక్షపాతం చూపించారని నిరాశను వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐను ఎంతో మంచిగా చూపించడానికి బాలీవుడ్ చిత్రనిర్మాతలు ప్రవర్తిస్తూ ఉన్నారని ఆరోపించారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం ‘పఠాన్’ లో భారత్ ను ఓ ప్రమాదకరమైన వైరస్ నుండి కాపాడే రా ఏజెంట్ పాత్రలో షారుఖ్ ఖాన్ నటించారు. ఇందులో జాన్ అబ్రహం మాజీ RAW ఏజెంట్ గా ఉంటాడు.. అతడు భారత్ ను ఎలాగైనా దెబ్బతీయాలని పాకిస్థాన్ తో చేతులు కలుపుతాడు. అతడిని అంతం చేసే పనిని షారుఖ్ ఖాన్ పోషించాడు. షారూఖ్ ఖాన్ ప్రేమలో పడిన పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ రుబీనా పాత్రను దీపికా పదుకొణె పోషించింది. రుబీనా షారుఖ్ ఖాన్ తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయం చేస్తుంది. విడుదలకు ముందే ఈ సినిమా పాటల కారణంగా వివాదాలు చుట్టుముట్టాయి.