భారత ఆర్మీలో చేరడమే లక్ష్యం.. 19 ఏళ్ల కుర్రాడు అర్ధరాత్రి 10 కిలోమీటర్లు రన్నింగ్ ప్రాక్టీస్

0
719

కొందరికి ఎన్నో వసతులు ఉన్నా ఏదైనా చేయాలనే లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటారు. కానీ ఈ 19 ఏళ్ల యువకుడు అర్ధరాత్రి పూట పరిగెడుతూ కనిపించాడు. లిఫ్ట్ ఇస్తామన్నా ఎక్కలేదు. ఎంతో కష్టపడి బ్రతుకుతూ ఉన్న యువకుడు.. తన లక్ష్యం మాత్రం భారత ఆర్మీలో చేరడమేనని చెప్పాడు. ప్రస్తుతం ఆ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

నోయిడాలో అర్ధరాత్రి పరుగు తీస్తున్న వీడియోను జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత వినోద్ కప్రీ షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం (మార్చి 20) అప్‌లోడ్ చేయబడిన 2:20 నిమిషాల నిడివి గల క్లిప్ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడా సెక్టార్ 16లో తన షిఫ్ట్ అయిన తర్వాత పని నుండి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.

ఉత్తరాఖండ్ లోని అల్మోరా కు చెందిన ప్రదీప్ మెహ్రా నోయిడాలోని సెక్టార్ 16లో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. పొద్దున వెళితే అర్ధరాత్రి వరకు డ్యూటీ. రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెత్తుతూ వెళ్లడం అతడి దినచర్య. అతడితోపాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి నిర్మాత వినోద్ కాప్రి తన కారు నుండి ప్రదీప్ తో మాట్లాడాడు. ఎందుకు పరిగెత్తుతున్నావ్ అని అడిగినప్పుడు, అల్మోరా కు చెందిన యువకుడు ఇండియన్ ఆర్మీలో చేరడానికి సిద్ధమవుతున్నానని చెప్పాడు.

“ఉదయం ఎందుకు పరుగెత్తకూడదు?”, అని కాప్రి అడిగారు, దానికి ప్రదీప్ ఉదయాన్నే నిద్రలేచి వంట చేసుకోవాలని సమాధానం ఇచ్చాడు. అతని తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు, తన తల్లి ఆసుపత్రిలో ఉందని అతడు సమాధానం ఇచ్చాడు.. ‘‘ఎందుకు రాత్రి వేళ అలా పరుగెత్తుతున్నావు, నా కారులో రా దిగబెడతాను’’ అని అడిగినా.. ఆ బాలుడు నిరాకరిస్తాడు. ఉదయం రన్నింగ్ చేయొచ్చుగా? అని ప్రశ్నించాడు. అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుందని, సమయం చాలదని మెహ్రా బదులిచ్చాడు. చాలా సార్లు లిఫ్ట్ ఇస్తానన్నా, ఆ బాలుడు తీసుకోలేదు. ఆర్మీలో చేరడమే తన ధ్యేయమని ప్రదీప్ చెప్పాడు. అందుకోసమే నిత్యం సాధనలో భాగంగా రన్నింగ్ చేస్తున్నానని, కారులో వస్తే తన ప్రాక్టీస్ మిస్ అవుతుందని అన్నాడు. ప్రతి రోజు పొద్దున 8 గంటలకు లేవాలి. పనికి వెళ్లడానికి ముందు ఆహారం సిద్ధం చేసుకోవాలి. రాత్రి వచ్చిన తర్వాత కూడా ఆహారాన్ని వండుకుని తినడమే కాదు.. రాత్రి షిప్ట్ ఉద్యోగానికి వెళ్లిన సోదరుడి కోసం కూడా ఆహారాన్ని సిద్దం చేయాలన్నాడు. ఈ క్లిప్ వైరల్ అవుతుందని చిత్రనిర్మాత చెప్పినప్పుడు, “నన్ను ఎవరు గుర్తు పడతారు..?” అని అతడు సమాధానమిచ్చాడు. “ఇది వైరల్ అయినప్పటికీ నేను ఏ తప్పు చేయలేదు,” అని ప్రదీప్ మెహ్రా అన్నాడు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా ప్రదీప్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది.