భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేతాజీ గురించి భారతీయులందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. మన పాఠ్య పుస్తకాల్లో నేతాజీ గురించి అంతగా ప్రస్తావన లేదన్న రాజ్నాథ్ సింగ్ చరిత్రను పున: సమీక్షించాలని కోరారు. అయితే కొంతమంది దీన్ని చరిత్రను తిరిగి రాయడం అని పిలుస్తారని,.. కానీ తాను మాత్రం దీన్ని కోర్స్ కరెక్షన్ అని పిలుస్తానని తెలిపారు.
గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేటు స్కూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ నిజానికి భారత తొలి ప్రధాని నేతాజీయేనన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అండమాన్ దీవులను స్వాధీనం చేసుకుని 1943 అక్టోబరు 21 న నేతాజీ దేశానికి తొలి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. భారతదేశానికి తొలి ప్రధానిగా ‘ఆజాద్ హింద్ సర్కార్’ ను ఏర్పాటు చేసి భారత్ ను పాలించారని తెలిపారు. ఆ ప్రభుత్వంలో మంత్రులతోపాటు పోస్టల్ స్టాంపులు, కరెన్సీ, ఇంటలిజెన్స్ లాంటి వ్యవస్థలన్నిటినీ ఏర్పాటు చేశారని చెప్పారు. అతి తక్కువ వనరులతో ఓ ప్రభుత్వాన్ని నడపడమంటే అది సాధారణమైన విషయం కాదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. బోస్ స్వాతంత్ర్క సమరయోధుడిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కూడా అలుపెరగని పోరాటాన్ని చేశారని ఆయన జీవితంలో ప్రపంచానికి తెలియని ఎన్నో సంఘటనలున్నాయని తెలిపారు. ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు దేశ ప్రజలకు తెలియలేదని చెప్పారు. గత ప్రభుత్వాలు వీటన్నిటినీ దాచిపెట్టి ప్రజలకు తెలియకుండా చేశారన్నారు. కానీ అంతటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల గురించి దేశ ప్రజలకు తెలియజేసేందుకే నేతాజీకి చెందిన దాదాపు 300కు పైగా పత్రాలను బహిర్గతం చేశానని చెప్పుకొచ్చారు. అయితే దేశ స్వాంతంత్ర్యం కోసం ఇంతటి కృషి చేసిన నేతాజీ గురించి భవిష్యత్ తరాలకు తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్ర పుస్తకాల్లో నేతాజీ లాంటి వ్యక్తులకు గత ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించలేదని 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి రాగానే నేతాజీకి తగిన గౌరవమివ్వడం మొదలయిందన్నారు.
ఇక విద్యార్థులందరూ కూడా నేతాజీని స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలని తెలిపారు. నేతాజీలాగే జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. దేశాన్ని ను ఆత్మనిర్భర్ భారత్ గా తీర్చిదిద్దే గొప్ప అవకాశం విద్యార్థుల ముందున్నదని రాజ్నాథ్ అన్నారు. రాబోయే కాలంలో ప్రతి రంగంలోనూ సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపిన రక్షణ మంత్రి విద్యార్థులు తమ చదువుకు పూర్తిగా ఇంటర్నెట్ పై ఆధారపడకుండా పరిశోధనా సంస్థలు, లైబ్రరీలు ఆర్కైవ్ లాంటి వాటినే ఎక్కువగా ఆధారం చేసుకోవాలని తెలియజేశారు. వీటితో పాటు భారత్ లోని విభిన్న సంస్కృతులు, భాషలు, విద్య, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవడం అవసరమన్నారు. కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమవకుండా సమాజంపై అవగాహన ఏర్పరచుకోవాలని రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే చరిత్ర పుస్తకాల్లో భారతీయతను ప్రతిబింబించేలా మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకున్న చరిత్ర స్థానంలో భారతీయ రాజుల గురించి స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను పొందుపరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిపై ఇప్పటికీ చర్చలు జరుపుతున్నా కూడా ఒక కొలిక్కి రావడంలేదు. వీలైనంత త్వరగా పుస్తకాల్లో మార్పులు చేర్పులు చేసి పూర్తి భారతీయ విద్యను అందించాలని అందరూ కోరుతున్నారు.