నేపాల్.. హిందూ దేశం. ఆ దేశంలో ప్రస్తుతం హిందువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఈ విషయం ఆ దేశంలో నిర్వహించిన అధికారిక లెక్కల ద్వారా తెలిసింది. హిందువుల సంఖ్య తగ్గిపోతూ ఉండగా.. ఇస్లాం, క్రిస్టియానిటీ బాగా పెరిగిపోతూ ఉంది. జూన్ 3న.. నేపాల్ ప్రభుత్వం 2021 జనాభా లెక్కల ఆధారంగా కులం, జాతి, భాషా పరంగా జనాభా గణాంకాలను విడుదల చేసింది. నేపాల్ ప్రభుత్వం అందించిన డేటా ప్రకారం ఆ దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఉన్న హిందువులు, బౌద్ధుల జనాభా తగ్గిపోయింది.
దేశం మొత్తం జనాభా 29 మిలియన్లు ఉండగా.. హిందువుల సంఖ్య 22 మిలియన్లు ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం, మొత్తం జనాభాలో 81.19 శాతం మంది హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. హిందువుల తర్వాత బౌద్ధులు ఎక్కువగా ఉన్నారు. నేపాల్ జనాభాలో 8.2 శాతం బౌద్ధులు ఉన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో హిందూ మతాన్ని అనుసరించేవారు 0.11 శాతం తగ్గగా, బౌద్ధమతాన్ని అనుసరించేవారు 0.79 శాతం తగ్గారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలోని జనాభాలో 81.3 శాతం మంది హిందూ మతాన్ని, 9 శాతం బౌద్ధమతాన్ని, 4.4 శాతం ఇస్లాం, 0.1 శాతం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని ప్రభుత్వం అప్పట్లో గుర్తించింది. తాజా జనాభా లెక్కల ప్రకారం, ఇప్పుడు ఇస్లాం మతాన్ని 5.09 శాతం.. క్రైస్తవ మతం 1.76 శాతం మంది అనుసరిస్తున్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం కిరాత్ తెగకు చెందిన వాళ్లు కూడా 0.36 శాతం పెరిగి మొత్తం జనాభాలో 3.17 శాతంగా ఉన్నారు.
నేపాల్ దేశంలో మాట్లాడే భాషలకు సంబంధించిన డేటాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. నేపాల్‌లో 124 భాషలు ఉన్నాయి. అందులో 44 శాతం మంది నేపాలీ మాట్లాడతారు. తర్వాత 11.05 శాతం మైథాలీ మాట్లాడుతారు. ఇక 6.24 శాతం భోజ్‌పురి మాట్లాడతారు. ఇతర ప్రసిద్ధ భాషలలో థారు 5.88 శాతం, తమంగ్ 4.88 శాతం ఉన్నాయి. నేపాల్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తుంది. 2021 లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా.. కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా జనాభా లెక్కలు నిర్వహించడం ఆలస్యం అయింది.
గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ లో క్రైస్తవుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. అందుకు కారణం మిషనరీలే. ఒక దశాబ్దం కంటే తక్కువ కాలంలోనే నేపాల్‌లో క్రైస్తవుల జనాభా 68 శాతం పెరిగింది. ముఖ్యంగా దక్షిణ కొరియా నుండి వచ్చిన క్రైస్తవ మిషనరీలు మతమార్పిడులకు తెగబడుతూ ఉన్నాయి. క్రైస్తవ మిషనరీలు బుద్ధుడి జన్మస్థలమైన నేపాల్ ను లక్ష్యంగా చేసుకున్నాయని ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేపాల్‌లో 2011లో 3,76,000 మంది క్రైస్తవులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 5,45,000కి పెరిగింది. ఇది దాదాపు 68 శాతం పెరిగింది. నేపాల్ లో ముస్లింల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. గత 20 ఏళ్లలో నేపాల్ లో ముస్లిం జనాభా 4 శాతం నుండి 9 శాతానికి పెరిగింది. రానున్న 20 ఏళ్లలో ఇది రెట్టింపు కావచ్చని అంచనా వేస్తున్నారు. నేపాల్ లో రోహింగ్యా ముస్లింల సమస్య కూడా ఉందని ఆ దేశ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ఇక పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ కూడా నేపాల్ ను స్థావరంగా చేసుకొని కుట్రలు పన్నుతూ ఉంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ చాలా కాలంగా నేపాల్‌లో యాక్టివ్‌గా ఉంది. ఐఎస్‌ఐ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా నకిలీ కరెన్సీ నోట్లు వంటి అక్రమ వ్యాపారాలను కూడా నడుపుతోంది.