Sports

తల్లిదండ్రుల కోరికను తీర్చిన నీరజ్ చోప్రా..!

శనివారం నాడు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తన సోషల్ మీడియా ఖాతాలో తాను చేసిన ఓ పనిని షేర్ చేసుకున్నాడు. అదేమిటంటే తన తల్లిదండ్రుల కోరికను నెరవేర్చడం. తల్లిదండ్రుల చిన్న కోరికలను నెరవేర్చాలని పిల్లలు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. తాజాగా ‘గోల్డెన్‌ బాయ్‌’ నీరజ్‌ చోప్రా తన తల్లిదండ్రుల చిన్న కోరికను తీర్చాడు. తన తల్లిదండ్రులతో కలిసి విమానం ఎక్కినట్లు ఉన్న ఫోటోలను పంచుకున్నాడు. నా తల్లిదండ్రులను మొదటిసారి విమానంలో తీసుకెళ్లగలిగాను. నా చిరకాల కోరిక నెరవేరిందని నీరజ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. నీరజ్ చోప్రా తల్లిదండ్రులు ఎప్పుడూ విమానం ఎక్కలేదట.. ఇప్పుడు నీరజ్ చోప్రా తల్లిదండ్రులను చార్టర్డ్ ఫ్లైట్ లో తీసుకుని వెళ్ళాడు. తల్లిదండ్రులు సరోజ్‌ దేవి, సతీశ్‌ కుమార్‌ను తొలిసారిగా విమానం ఎక్కించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశాడు నీరజ్‌. ‘‘నా కల నేడు నెరవేరింది. మొట్టమొదటి సారిగా నా తల్లిదండ్రులు విమాన ప్రయాణం చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాల వల్లే ఇదంతా సాధ్యమైంది’’ అని ఆనందం వ్యక్తం చేశాడు. పలువురు ప్రముఖులు, నెటిజన్లు నీరజ్ చోప్రా చేసిన పనిని ప్రశంసించారు.

ఈ ఏడాది ఆగస్టు 7 న నీరజ్ చోప్రా భారతదేశానికి మొదటి అథ్లెటిక్ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఆగస్టు 7 న జావెలిన్ త్రో ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రా 86.59 మీటర్ల త్రోతో క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. అతను తన మొదటి ప్రయత్నంలోనే ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. ఫైనల్స్‌లో, చోప్రా మొదటి త్రోలో 87.03 మీటర్లు మరియు రెండవది 87.58 మీటర్లు సాధించాడు. అతని రెండవ త్రో ఒలింపిక్ స్వర్ణం గెలుచుకోవడానికి సరిపోయింది. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి స్టార్ అథ్లెట్‌గా మారిపోయాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి పెద్ద ఈవెంట్‌లలో మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + one =

Back to top button