నీరా టాండన్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జో బైడెన్

0
766

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన బృందంలో భారత మూలాలున్న ఎంతో మందికి అవకాశం కల్పిస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! తాజాగా మ‌రో ఇండియ‌న్ అమెరిక‌న్ వైట్‌హౌస్‌ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా నియమితులయ్యారు. భార‌తీయ మూలాలున్న నీరా టాండ‌న్‌ను
వైట్‌హౌస్‌ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా బైడెన్ నియ‌మించారు.
నీరా టాండ‌న్‌ కు మంచి పదవి అందించడానికి జో బైడెన్ కూడా చాలానే కష్ట పడ్డారు. ఎట్టకేలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు జో బైడెన్. భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నియ‌మించాల‌ని బైడెన్‌ అనుకున్నప్పటికీ.. నీరా గతంలో డెమొక్రాటిక్‌ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అవి వివాదాస్పదమమ‌వ‌డంతో ఆమె నియామకాన్ని మంత్రులు, డెమొక్రాటిక్‌ చట్టసభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఆమె నియామకాన్ని ధ్రువీకరించేందుకు సెనెట్‌లో సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో నీరా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇదంతా మార్చి నెలలో జరిగింది. ఆమె సాధించిన విజయాపై తనకు చాలా గౌరవం ఉందని, త్వరలోనే ఆమెకు తన యంత్రాంగంలో మరో పదవిలోకి తీసుకొనే అవకాశాలన్ని పరిశీలిస్తున్నామని బైడెన్‌ మాట ఇచ్చారు.
తాజాగా ఆమెను సీనియ‌ర్ స‌ల‌హ‌దారుగా బైడెన్ నియ‌మించారు. సెనెట్ ఆమోదం తెల‌పాల్సిన అవ‌స‌రం లేకపోవడంతో ఇకపై నీరా టాండ‌న్‌ వైట్‌హౌస్‌ సీనియ‌ర్ స‌ల‌హాదారుగా తన విధులను నిర్వర్తించనున్నారు . ఆమె హెల్త్‌కేర్, ఇంట‌ర్నెట్ యాక్సెస్ అంశాలను చూసుకోనున్నారు. సెంట‌ర్ ఫ‌ర్ అమెరిక‌న్ ప్రోగ్రెస్ (సీఏపీ) అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్న టాండ‌న్‌ ఇంతకు ముందు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్ల‌రీ క్లింట‌న్‌కు స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించారు. నీరా టాండన్ నియామకంపై సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీపీసీ) హర్షం వ్యక్తం చేసింది. నీరా టాండన్ ను ప్రశంసిస్తూ పలువురు భారతీయ అమెరికన్లు ట్వీట్లు చేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here