ఉద్యోగులకు శాపంగా మారిన యుద్దాలు.. 5 లక్షల మందిని రోడ్డున పడేసిన ద్ర‌వ్యోల్బ‌ణం ప్రభావం..!

0
164

ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం.. ఆపై ఇజ్రాయెల్ – హమాస్ మధ్య పోరుతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం కార్పొరేట్ కంపెనీల‌ను, ప్ర‌త్యేకించి ఐటీ కంపెనీల‌ను వెంటాడుతున్న‌ది. ద్రవ్యోల్బ‌ణ నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ దేశాల సెంట్ర‌ల్ బ్యాంక్‌ల‌న్నీ వ‌డ్డీరేట్లు పెంచ‌డంతో మాంద్యం ప్ర‌భావం పెరిగిపోయింది. దీంతో ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల‌తో పాటు కార్పొరేట్ సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఆధీనంలోని లింక్డ్ఇన్ సైతం.. ఇంజినీరింగ్‌, ప్రొడ‌క్ట్‌, టాలెంట్‌, ఫైనాన్స్ టీమ్స్‌లలో సుమారు 668 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా రెండేండ్ల‌లో రెవెన్యూ గ్రోత్ త‌గ్గ‌డంతో మైక్రోసాఫ్ట్ మ‌రోమారు సంస్థ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. దీంతో ఉద్యోగుల ఉద్వాస‌న ప్రారంభ‌మైంది.

ఒక్క మైక్రోసాఫ్ట్‌, దాని అనుబంధ లింక్డ్ఇన్‌లో మాత్ర‌మే ఈ దుస్థితి లేదు. భార‌త్‌లో పేరొందిన ఎడ్యుటెక్ స్టార్ట‌ప్ బైజూ`స్ త‌న బిజినెస్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా 4000 నుంచి 5000 మంది ఉద్యోగుల‌ను ఇండ్ల‌కు సాగ‌నంపింది. ఐటీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు.. ఆశ్చ‌ర్యం అంత‌క‌న్నా కాదు. గ‌త రెండేండ్లుగా అతిపెద్ద ఐటీ సంస్థ‌ల‌తోపాటు ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల్లో నిరంత‌రం ఉద్యోగుల ఉద్వాస‌న కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌తి గంట‌కూ స‌గ‌టున‌ 23 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగాల ఉద్వాస‌న‌పై ఏర్పాటైన లేఆఫ్స్.ఎఫ్‌వైఐ అనే వెబ్‌సైట్ ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్ప‌టి వ‌ర‌కూ 404,962 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాయి. 2022లో 1061 టెక్ సంస్థ‌లు 1,64,769 మంది ఉద్యోగులు, 2023 ఈ నెల 13వ‌ర‌కూ 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికాయి.

ప్ర‌తి రోజూ స‌గ‌టున 555 మంది.. ప్ర‌తి గంట‌కు 23 మంది ఐటీ నిపుణులు నిరుద్యోగుల‌వుతున్నారు. 2022లో మొద‌లైన ఉద్యోగాల ఉద్వాస‌న ప‌ర్వం.. 2023 ప్రారంభంలో గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గ‌రిష్టంగా 89,554 మంది టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇటీవ‌లి కాలంలో కొన్ని నెల‌లుగా ఉద్యోగుల ఉద్వాస‌న‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఆర్థిక మాంద్యం, పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ వ‌ల్ల గ‌త జూన్‌లో 4,632 టెక్ నిపుణులు, ఉద్యోగులు ఇండ్ల‌కు ప‌రిమితం అయ్యారు. మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు స‌హా టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తి ఒక్క‌రి మీద‌ ఆర్థిక మాంద్యం ప్ర‌భావం చూపింది. టెక్ రంగంలో కొన్ని సెక్టార్లపై భారీగా ప్ర‌భావం ప‌డింది. ఈ ఏడాది రిటైల్ టెక్ రంగంలో 29,161 మంది, క‌న్జూమ‌ర్ టెక్ రంగంలో 28,873 మంది ఉద్వాస‌న‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల గేమింగ్ కంపెనీలు కూడా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి.

ఆస్కిడెంట్ స్టూడియోస్‌, బీండాగ్‌, క్రిస్ట‌ల్ డైన‌మిక్స్‌, రోబ్లోక్స్‌, బ్లిజార్డ్‌, టీం 17, నాటీ డాగ్‌, నైయాంటిక్‌, కీవ‌ర్డ్స్ వంటి సంస్థ‌లు ఉద్యోగుల తొల‌గింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాయి. ఇక హార్ట్‌వేర్ కంపెనీ.. అందులో చిప్‌ల త‌యారీ సంస్థ క్వాల్ కామ్.. కాలిఫోర్నియాలోని రెండు యూనిట్ల‌లోనే 1258 మంది ఉద్యోగుల ఉద్వాస‌న‌కు ప్లాన్ సిద్ధం చేశాయి. ఇంకా చైనాలిసిస్‌, ప్లెక్స్‌, సిస్క‌, పీ ఇన్సూరెన్స్ కూడా ఉద్యోగుల ఉద్వాస‌న‌కు పాల్ప‌డ్డాయి. ఎపిక్ గేమ్స్ సంస్త ఫార్‌నైట్ 16 శాతం ఉద్యోగుల‌ను త‌గ్గించుకునే ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. భార‌త్‌లో ఎడ్యుటెక్ జెయింట్ బైజూ`స్ ఒక్క‌టే ఉద్యోగుల లే-ఆఫ్స్‌కు మిన‌హాయింపు కాదు. 70కి పైగా భార‌త్ టెక్ స్టార్ట‌ప్ కంపెనీలు 21 వేల‌కు పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాయి.

ఆ జాబితాలో బైజూస్‌, చార్జ్‌బీ, కార్స్ 24, లీడ్‌, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్‌, ఇన్నోవాక‌ర్‌, ఉడాన్‌, అన్ అకాడ‌మీ, వేదాంతు ఉన్నాయి. క్విక్ గ్రాస‌రీ డెలివ‌రీ సంస్థ డుంజో..గ‌త‌నెల‌లో ఆర్థిక స‌మ‌స్య‌ల పేరిట 150 నుంచి 200 మందిని ఇంటికి సాగ‌నంపింది. ఈ ఏడాదిలో రెండు ద‌ఫాల్లో సుమారు 400 మందిని డుంజో తొల‌గించింది. బైజూ`స్ ప్ర‌త్య‌ర్థి సంస్థ అన్ అకాడ‌మీ గ‌త జూలైలో 1500 మందిని తొల‌గిస్తే, హెల్త్‌కేర్ స్టార్ట‌ప్ మోజోకేర్ త‌న సిబ్బందిలో 80 శాతం మందికి లే-ఆఫ్ ప్ర‌క‌టించింది. ఇక టీసీఎస్‌లో త్రైమాసిక ప్రాతిపదికన 6,333 మంది ఉద్యోగుల సంఖ్య నికరంగా క్షీణించింది. జూన్ త్రైమాసికంలో 615,318 గా ఉన్న ఉద్యోగుల సంఖ్య, సెప్టెంబర్ 30 నాటికి 608,985 వద్దకు చేరింది.

వార్షిక ప్రాతిపదికన చూస్తే గత ఏడాది 616,171 ఉద్యోగులు 7,186 మంది తగ్గిపోయారు. తమ నియామక లక్ష్యాలను రీకాలిబ్రేషన్ చేయడం దీనికి కారణమని కంపెనీ తెలిపింది. తెలివైన ఫ్రెషర్‌లను ముందస్తుగా నియమించుకోవడం, సరైన నైపుణ్యాలతో వారికి శిక్షణ ఇవ్వడంలో పెట్టుబడి పెట్టడం అనే తమ వ్యూహం ఫలిస్తోందని.. ఆ టాలెంట్ స్ట్రీమ్‌లోకి రావడంతోపాటు తగ్గిన అట్రిషన్‌ను తగ్గించి, స్థూల జోడింపులను రీకాలిబ్రేట్ చేయగలిగామని చెబుతోంది. ఉత్పాదకతను పెంచడం, ప్రాజెక్ట్ ఫలితాలను పెంచడమే లక్ష్యమని వివరించింది.

అటు ఇన్ఫోసిస్ తన హెడ్‌కౌంట్‌లో వరుసగా 7,530 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాల ప్రకారం క్రితం త్రైమాసికంలో కంపెనీలో 3,36,294 మందితో పోలిస్తే సెప్టెంబర్ 2023 నాటికి 3,28,764 మంది ఉన్నారు. గత ఏడాది త్రైమాసికంతో పోల్చినా కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. క్యాంపస్‌లలో మాస్ రిక్రూటింగ్ డ్రైవ్‌లను నిర్వహించబోమని కూడా ఆ కంపెనీ చెప్పింది. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్‌లను నియమించుకున్నామని., డిమాండ్ కంటే ముందుగానే నియమించుకున్నామని తెలిపింది, ముఖ్యమైన ఫ్రెషర్ బెంచ్ ఇంకా ఉందని కంపెనీ చెప్పింది. మరోవైపు హెచ్‌సీఎల్‌టెక్ కొత్త నియమాలను ప్రకటించినప్పటికీ హెచ్‌సిఎల్‌టెక్ నికర హెడ్‌కౌంట్ మాత్రం క్షీణించింది. క్యూ1లో కంపెనీ హెడ్‌కౌంట్ 2,506 తగ్గగా Q2 FY 24లో 2,299కి తగ్గింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,21,139గా ఉంది. ఈ క్షీణత ఇది వరుసగా రెండో త్రైమాసికం. గత 18 నెలల్లో నియమించుకున్న చాలా మంది ఫ్రెషర్లు సిద్ధంగా ఉన్నారని.. అందుకే అట్రిషన్‌ను బ్యాక్‌ఫిల్ చేయలేదని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే సీక్వెన్షియల్ ప్రాతిపదికన 1 శాతం తగ్గిందని చెప్పింది.

ఇక మూడు ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఫలితాలను విడుదల చేశాయి. ఫైనాన్షియల్‌తో పాటు, నియామకాల విషయానికి వస్తే Q2 త్రైమాసికంలో స్వల్పంగా తగ్గాయి. సంవత్సరం క్రితం త్రైమాసికంలో టీసీఎస్‌ 9,840 మందిని నియమించుకుంది. ఇన్ఫోసిస్ 10,032 మందిని నియమించుకుంది. HCLTech 8,382 మందిని నియమించుకుంది. ఈ మూడు కంపెనీల సంయుక్త హెడ్‌కౌంట్ వృద్ధి 28,254గా ఉంది. అదే సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం మూడు కంపెనీల నికర ఉద్యోగుల చేరిక 16,162 వద్ద ప్రతికూలంగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదువుతున్న వారి ఉద్యోగాలపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా లేటెస్ట్‌ టెక్నాలజీ కోర్సులను నేర్చుకోవడంతోపాటు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవైపు ఏఐ విధ్వంసంపై ఆందోళ‌న కొనసాగుతోంది. మ‌రోవైపు జాబ్ మార్కెట్‌లో అనిశ్చితి వేలాది మందిని లేఆఫ్స్‌ ఆందోళనలో పడేస్తోంది. ముఖ్యంగా సంక్లిష్ట సమయాల్లో ముందుగా కాంట్రాక్టు ఉద్యోగుల‌పై వేటు పడుతుందని, అత్య‌ధిక రిస్క్ గ్రూపులో వారే ఉంటారని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × one =