దేశంలో మతమార్పిడిని ప్రోత్సహించే మిషనరీలకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై.. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అమెజాన్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. నవంబర్ ఒకటిన అమెజాన్ ఇండియా అధిపతి అమిత్ అగర్వాల్‌ను స్వయంగా తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోరింది. మిషనరీలకు విరాళాలు అందించే విషయంపై సంస్థకు గతంలోనే నోటీసులు పంపినా.. అమెజాన్ సంస్థ స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ‘చైల్డ్ రైట్స్ కమిషన్’ అమిత్ అగర్వాల్ స్వయంగా తమముందు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది.
‘ఆల్ ఇండియా మిషన్’ అనే ఓ క్రిష్టియన్ మిషనరీకి అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో నిధుల సేకరణ కోసం ఒక ప్రకటనను విడుదల చేసింది. భారత్‌లోని పేదలకు సహాయం చేయడానికి విరాళాలు ఇవ్వండనే సారాంశంతో ఈ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రకటనలో ఉన్న సంస్థ భారత్ లో భారీగా మతమార్పిడులకు పాల్పడుతోందని ‘సోషల్ జస్టిస్ ఫోరం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’ అనే సంస్థ ‘చైల్డ్ రైట్స్ ఫోరం’కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులో ‘ఆల్ ఇండియన్ మిషన్’ అనే సంస్థ దేశంలో భారీయెత్తున మతమార్పిడులకు పాల్పడుతోందని ఫిర్యాదు చేసింది. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ అనాథ శరణాలయాలు ఉన్నాయని పేర్కొంటూ.. ఈ అనాధాశ్రమాల ముసుగులో మతమార్పిడులు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. భారత్‌లో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా మతమార్పిడులకు పాల్పడినట్లు సంస్థ తన వెబ్సైట్లో పొందుపరిచినట్లు సోషల్ జస్టిస్ ఫోరం ఫిర్యాదు చేసింది. ఇటువంటి సంస్థకు అమెజాన్ ఇండియా తన వెబ్సైట్లో ప్రకటనల ద్వారా నిధులను సమకూర్చుతోందని కంప్లెయింట్‌లో పేర్కొంది. దీంతపాటు ఈ నిధుల రూపంలో డబ్బులు మనీలాండరింగ్ కూడా జరిగిందేమో అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని సోషల్ జస్టిస్ అనే ఎన్జీవో అభ్యర్థించింది.
ఈ కంప్లెయింట్‌పై స్పందించిన NCPCR సమాధానం చెప్పాలంటూ అమెజాన్ ఇండియాకు సెప్టెంబర్ 14న నోటీసులు పంపింది. ఏడు రోజుల్లో ఆల్ ఇండియా మిషన్ సంస్థకు అందజేసిన నిధుల వివరాలన్నిటినీ తమకు తెలియజేయాలని కోరింది. అయితే నోటీస్‌కు అమెజాన్ ఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఈ నిర్లక్ష్య ధోరణితో ఆగ్రహించిన NCPCR ఈసారి ఏకంగా సమన్లు పంపింది. నవంబర్ 1న అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్‌ను స్వయంగా తమ ముందు హాజరై ఈ నిధులకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా సమన్లల పేర్కొంది. దీంతో నవంబర్ 1న అమెజాన్ భారత్ విభాగానికి అధిపతి అయిన అమిత్ అగర్వాల్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరోజు కూడా కమిషన్ ముందు హాజరు కాకపోతే అతడిపై అరెస్టు వారెంట్ జారీ చేసి.. అదుపులోకి తీసుకునే అధికారం NCPCR కు లభిస్తుంది.
ఇక అమెజాన్ ఇండియా మిషనరీలకు డబ్బులను అందజేయడం వివాదాస్పదంగా మారింది. సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మిషనరీలకు డబ్బులు సరఫరా చేస్తోందని సంస్థపై జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో మిషనరీల కార్యకలాపాలకు అతి పెద్ద ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ స్వయంగా పాల్గొనటమేంటని పలువురు విమర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ నిధులపై జాతీయ సంస్థ ఇచ్చిన నోటీసులకు కూడా స్పందించకపోవడం భారత దేశ చట్టాలను అగౌరవపరచడమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమెరికన్ కంపెనీలన్నీ ఇదే ధోరణిని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్విట్టర్ కూడా ఇదే తరహా ధోరణిని అనుసరించి విమర్శల పాలైందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇకనైనా ఈ సంస్థలు తమ ధోరణిని మార్చుకుని భారత చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని.. లేకపోతే దేశ ప్రజలు ఈ సంస్థలను బహిష్కరించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.