అంతా భయపడుతున్నా.. కరోనా కట్టడికి ఏ మాత్రం చర్యలు తీసుకోని కేరళ

0
843

ఇటీవలి కాలంలో కేరళలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే..! బక్రీద్ సమయంలో నిబంధనలను కేరళ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే వార్తలు కూడా వచ్చాయి. కేరళలో కోవిడ్ -19 రోగుల పర్యవేక్షణ విషయంలోనూ కేంద్ర మార్గదర్శకాలను పాటించకపోవడం వంటివి కేరళలో అధిక కోవిడ్ -19 సంఖ్యలకు కారణమని రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) యొక్క ఆరుగురు సభ్యుల బృందం కేరళలో మహమ్మారి పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్రం గత వారం కేరళకు పంపింది. దేశంలోని యాక్టివ్ కోవిడ్ -19 కేసులలో 50 శాతానికి పైగా ఈ రాష్ట్రానికి చెందినవవే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఎన్సీడీసీ బృందం పలు విషయాలను తెలియజేసింది. పాజిటివ్ రోగులు 90 శాతానికి పైగా ఇంటిలో ఒంటరిగా ఉన్నారని వెల్లడించింది. హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను పాటించడం లేదని బృందం తెలిపింది.హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా పేషెంట్లను సరిగ్గా పర్యవేక్షించట్లేదని సెంట్రల్ టీమ్ అసహనం వ్యక్తం చేసింది.

కరోనా బారిన పడిన 90 శాతం మంది బాధితులు హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నారని.. హోం ఐసోలేషన్ నిబంధనలను సరిగ్గా అమలు చేయట్లేదని విమర్శించింది. రాష్ట్రంలో ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. కరోనా సోకిన వారి కాంటాక్ట్ ల గుర్తింపు చాలా ఘోరమైన స్థాయిలో ఉందని, 1:20గా ఉండాల్సిన కాంటాక్ట్ ట్రేసింగ్.. కేవలం 1:1.5 గానే ఉందని తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను చాలా తక్కువగా చేస్తున్నారని, 80 శాతం వరకు యాంటీజెన్ టెస్టులపైనే ఆధారపడుతున్నారని కీలక విషయాలను బయటపెట్టింది. కంటెయిన్ మెంట్, మైక్రో కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేసినా ఎక్కడా కేంద్ర నిబంధనలను అనుసరించలేదని సెంట్రల్ టీమ్ తన నివేదికలో పేర్కొంది. కంటెయిన్ మెంట్ జోన్ల చుట్టుపక్కల బఫర్ జోన్లను ఏర్పాటు చేయలేదని తెలిపింది.

పాజిటివ్ కేసుల పెరుగుదల ఎక్కువగా ఉన్న జిల్లా అయిన మలప్పురంలో టెస్ట్ పాజిటివిటీ రేట్ 17.26 శాతంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 20 వేల కేసులు నమోదయ్యాయి. 148 మంది చనిపోయారు. పాజిటివిటీ రేటు 11.48 శాతంగా ఉంది. రోజూ కేసులు పెరుగుతున్నా దేశంలోని రోజువారీ కేసుల్లో సగం దాకా అక్కడే వస్తున్నా అన్నింటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రతి పాజిటివ్ కేస్‌లో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేసిన సంఖ్య చాలా తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. తిరువనంతపురం వంటి జిల్లాలలో, ఒక పాజిటివ్ కేసుకి రెండు కంటే తక్కువ కాంటాక్ట్ లను ట్రేస్ చేసినట్లు కనుగొనబడ్డాయి. కుటుంబ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ట్రేస్ చేసింది వీరినే అని చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది.

కేవలం ఆదివారాల్లోనే లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఇవాళ ప్రకటించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో అన్ని షాపులూ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు వెయ్యికి పదిగా ఉంటే ఆయా చోట్ల ట్రిపుల్ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో 40 మందికి మించకుండా పబ్లిక్ ఫంక్షన్స్ కు అనుమతించింది. వివాహాలు మరియు అంత్యక్రియలు 20 మందికి మించకుండా నిర్వహించవచ్చని కేరళ అధికారులు చెబుతూ ఉన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here