More

  బాలీవుడ్ స్టార్ కిడ్స్ కు చుక్కలు.. దేశం విడిచి వెళ్ళిపోతున్నారా

  బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ కు సినిమా ఛాన్సెస్ ఎంతో ఈజీగా దక్కుతూ ఉంటాయి. తల్లిదండ్రులు, కొన్ని ప్రొడక్షన్ హౌస్ లు ఎప్పుడూ అండగా నిలుస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ లు గ్రూపులుగా ఏర్పడి బయట నుండి వచ్చిన వాళ్లను తొక్కేస్తూ ఉంటాయనే ప్రచారం కూడా సాగుతోంది. కొందరు ప్రముఖ దర్శక నిర్మాతలు.. అవుట్ సైడర్లను అణగదొక్కారనే ప్రచారం ఇప్పటిది కాదు.. ఎప్పటి నుండో ఉంది..! కొందరు నటులు అక్కడ ఎదగలేక వేరే చోటుకు వెళ్లిపోవడం.. లేదంటే ఇండస్ట్రీనే వదిలి వెళ్లిపోవడం జరిగాయి. ఇంకొందరు కఠిన నిర్ణయాలే తీసుకున్నారు.

  ఇప్పుడు అదే స్టార్ కిడ్స్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తూ ఉండడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఎంతో కష్టపడి స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటిది అతడి పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు. ఆర్యన్ ఈ నెల 3న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఓ క్రూయిజ్ షిప్పులో జరుగుతున్న రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకంపై సమాచారంతో పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్ కు కోర్టు డ్రగ్స్ కేసులో రిమాండ్ పొడిగించింది. ఆర్యన్ కు అక్టోబరు 30 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ముంబయిలోని ఎన్డీపీఎస్ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

  ఇక ఆర్యన్ ఖాన్ తో సన్నిహితంగా ఉండే అనన్య పాండేను కూడా ఎన్సీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. గురువారం షారుక్‌ నివాసం ‘మన్నత్‌’లో సోదాలు నిర్వహించారు. అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్‌ ఫోన్‌, ల్యాప్ టాప్ ను సీజ్‌ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం ఆమెను సుదీర్ఘంగా విచారణ చేయగా.. శుక్రవారం కూడా విచారణకు రావాలని పిలిచారు. చంకీ పాండే కుమార్తె అనన్య పాండేను ఎన్‌సీబీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్లీ విచారణకు రావాలని ఆదేశించారు. ఎన్‌సీబీకి దగ్గరి వ్యక్తుల సమాచారం మేరకు, ఆర్యన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉన్న పలువురు స్టార్‌ కిడ్స్‌ను ఎన్సీబీ విచారించే అవకాశాలు లేకపోలేదు. వీరంతా ఆర్యన్‌తో చాట్‌లో పాల్గొన్నట్లు ఎన్‌సీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలో వీరందరికీ సమన్లు పంపి విచారణకు రావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.

  స్టార్ కిడ్స్ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా:

  డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టైన తర్వాత చాలా మంది బాలీవుడ్ స్టార్ పిల్లలు ఇండియా విడిచి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. ‘నాకున్న ఆధారాల ప్రకారం చాలా మంది ప్రముఖుల పిల్లలు ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ తర్వాత భారతదేశాన్ని విడిచి వెళ్లాలని యోచిస్తున్నారు. ఆర్యన్ ఖాన్‌కే ఇలా జరిగితే ఎవరికైనా జరుగొచ్చని వారు భావిస్తున్నారు’ అని కమల్‌ ఆర్‌ ఖాన్‌ ట్వీట్ చేశాడు.

  Trending Stories

  Related Stories