భారత నౌకాదళం మునుపెన్నడూ లేని రీతిలో శత్రుదుర్బేధ్యంగా తయారవుతోంది. ముఖ్యంగా చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో నేవీ అమ్ములపొది మరింత పరిపుష్టం అవుతోంది. అత్యాధునిక నౌకలు, జలాంతర్గాములు సిద్ధమవుతున్నాయి. తాజాగా పూర్తి స్వదేశీ పరిజ్ఙానం తయారైన పవర్ ఫుల్ సబ్ మెరైన్ కంరజి విధుల్లోకి చేరేందుకు సిద్ధమైంది. ఈ నెల 10న కరంజి జలప్రవేశం చేయనున్నట్టు ఇటీవలే నేవీ ప్రకటించింది. స్కార్పియన్ క్లాస్ కు చెందిన ఈ జలాంతర్గామి సీ ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. ఫిబ్రవరి 15 రోజున సబ్ మెరైన్ ను నేవీకి అప్పగించారు.
ఆరు స్కార్పియన్ క్లాస్ సబ్ మెరైన్లలో INS కరంజి మూడవది. INS కల్వరీ, INS ఖండేరీ ఇప్పటికే నేవీకి సేవలందిస్తున్నాయి. మొత్త ఆరు అత్యాధునిక సబ్ మెరైన్లలో కరంజి మూడవది. మరో మూడు సీ ట్రయల్స్ లో వున్నాయి. స్వార్పియన్ క్లాస్ లో తొలి సబ్ మెరైన్ INS కల్వరిని ప్రధాని నరేంద్ర మోదీ 2017 డిసెంబర్ 14న ప్రారంభించారు. ఇక INS ఖండేరీ 2019 సెప్టెంబర్ 28 నుంచి సేవలందిస్తోంది. తాజాగా INS కరంజి కూడా సేవలకు సిద్ధమైంది. నిజానికి, 2019లోనే కరంజి సబ్ మెరైన్ జలప్రవేశం చేయాల్సివుంది. కానీ, అనివార్యకారణాలవల్ల ఆలస్యమైంది. ముంబైలోని మజగాన్ డాక్ యార్డ్ లో INS కరంజిని తయారు చేశారు.
ఇక, స్కార్పియన్ క్లాస్ లో నాలుగవ సబ్ మెరైన్ INS వేలా 2019 మే 6 నుంచి సీ ట్రయల్స్ లో వుంది. అలాగే, ఐదవ సబ్ మెరైన్ INS వాగిర్ కూడా 2020 నవంబర్ 12 నుంచి సీ ట్రయల్స్ చేస్తోంది. ఇక, ఆరవదైన INS వాగ్ షీర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఇది కూడా త్వరలోనే సీ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.