National

ఎంపీ, నటి నవనీత్ కౌర్ కు ఊహించని షాక్ ఇచ్చిన బాంబే హై కోర్టు

ఒకప్పటి టాలీవుడ్ నటి నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో అమరావతి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే..! ఆమె పార్లమెంట్ లో తనదైన ప్రసంగాలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమెకు బాంబే హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె ఎస్సీ కాదని.. ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2 లక్షల రూపాయల జరిమానా కూడా వడ్డించింది.

నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని పేర్కొంటూ తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఆమె ఎస్సీ కాదని తేల్చింది. కుల ధ్రువీకరణ రద్దు నేపథ్యలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంబ్ ఈ మేరకు జరిమానా విధించింది. ఈ సర్టిఫికెట్లు సరైనవే అని నిర్ధారించుకునేందుకు కోర్టు నవనీత్ కౌర్‌కు నెల రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ ఆమె నెలలోపు ఈ విషయాన్ని నిరూపించలేకపోతే లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు విధించిన జరిమానా మొత్తాన్ని మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.

ఆమెను శివసేన నాయకులు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే..! శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని.. శివసేన లెటర్ హెడ్ తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని, హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు. హైకోర్టు తీర్పుపై ఎంపీ నవనీత్ కౌర్ స్పందించారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని.. దీనిపై తాను సుప్రీంకోర్టుకు వెళతానని అన్నారు. అక్కడ తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × four =

Back to top button