పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేసి కొన్ని రోజులు కూడా కాకముందే ఇప్పుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. ఒక వ్యక్తి పతనం అతను రాజీ పడటం ద్వారా ప్రారంభమవుతుందని తన రాజీనామా లేఖలో సిద్దూ తెలిపారు. పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ సంక్షేమం విషయంలో తాను ఏ మాత్రం రాజీ పడలేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణాల వల్లే తాను పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. పీసీసీ పదవికి రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సేవ చేస్తానని తెలిపారు. రాజీనామా లేఖను సిద్ధూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు.
సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సిద్ధూ రాజీనామా చేయడం కాంగ్రెస్ నాయకత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా సిద్ధూను నియమించడంపై పెద్ద రాజకీయాలే నడిచాయి. ప్రియాంక గాంధీ వాద్రా సిద్ధూను నియమించడం కోసం చాలా మందిని సైలెంట్ చేశారు. కానీ ఇప్పుడు సిద్ధూ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారని అంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఇక సిమ్లా పర్యటన నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా ఢిల్లీ చేరుకోలేదు.
నవజ్యోత్ సిద్ధూకు సన్నిహితుడిగా భావించిన చరణ్‌జిత్ సింగ్ చన్నీనే కొత్త ముఖ్యమంత్రిగా నియమించారు. ఇక సిద్ధూనే చాలా విషయాలు చూసుకునేవారు. కొన్ని నిర్ణయాలలో సిద్ధూ “సూపర్ ముఖ్యమంత్రి” గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.
సిద్ధూ పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పందించారు. సిద్ధూకు నిలకడ లేదని తాను ముందే చెప్పానంటూ ట్వీట్ చేశారు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌కు సిద్ధూ సరైన నేత కాదని కెప్టెన్ మరోసారి చెప్పారు. పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిద్ధూ దేశానికి ప్రమాదకారి అని ఇటీవల అమరీందర్ వ్యాఖ్యలు చేశారు.