National

అమరావతిలో ఫార్మసిస్టు హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన నవనీత్ రాణా

మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన ఫార్మసిస్టు ఉమేష్ కోల్హే హత్య కేసును పోలీసులు కావాలనే తప్పుదోవ పట్టించారని ఎంపీ నవనీత్ రాణా ఆరోపించారు. దోపీడి కేసుగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నించారని అన్నారు. ఎన్ఐఏ విచారణ ప్రారంభమయ్యే సమయంలోనే ఉదయ్ పూర్ టైలర్ హత్య మాదిరిగా కనిపిస్తోందని పోలీసులు చెప్పారని ఆమె అన్నారు.

నూపుర్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ లు చేసినందుకు మ‌హారాష్ట్ర అమ‌రావ‌తిలో ఓ వెట‌ర్న‌రీ ఫార్మ‌సిస్టు హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ను విచారణకు ఆదేశించింది. ఈకేసులో పోలీసుల‌పై ఎంపీ న‌వనీత్ రాణా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఘటనపై పోలీసులతో తాను మాట్లాడాన‌ని న‌వ‌నీత్ రాణా చెప్పారు. పోలీసులు అది దొంగ‌త‌నం కేసు అని చెప్పార‌ని.. మృతుడు ఉమేష్ కోల్హే కుటుంబంతో మాట్లాడామ‌ని అన్నారు. అయితే అత‌డు చాలా సౌమ్యుడ‌ని, ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవ‌ని త‌మ‌కు తెలిసింద‌ని అన్నారు. ఇది ఉద‌య్ పూర్ త‌ర‌హా ఘ‌ట‌నే అని ఆమె అన్నారు. ఎవరైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి ఉంటే.. ఆ డబ్బును కూడా దోచుకునేవాడని కానీ ఇక్క‌డ అది జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

అమ‌రావ‌తిలో వెటర్నరీ ఫార్మసిస్ట్ గా ప‌ని చేస్తున్న ఉమేశ్ ప్రహ్లాద్ రావు కొల్హే గ‌త నెలలో నూపుర్ శ‌ర్మ‌కు అనుకూలంగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టును కొందరు ముస్లిం సభ్యులూ, తన కస్టమర్లూ ఉండే గ్రూపులోనే షేర్ చేశాడు. జూన్ 21ను రోజు మాదిరిగానే ఆ రోజు కూడా ఫార్మసిస్ట్ ఉమేష్ కొల్హే త‌న దుకాణం మూసేసి ఇంటికి బ‌య‌లుదేరాడు. జూన్ 21న రాత్రి 10 గంటల నుంచి 10.30 గంటల మధ్య అతడి హత్య ఘటన చోటుచేసుకుంది. తన దుకాణం మూసి ద్విచక్ర వాహనంపై కొల్హే ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడితో పాటు తన కుమారుడు సంకేత్ (27), భార్య వైష్ణవి వేరే వాహనంపై వెళ్తున్నారు. వారందరూ విమెన్స్ కాలేజ్ గేటు దగ్గరకు రాగానే వెనుక నుంచి ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు కోల్హేను అడ్డుకున్నారు. ఓ యువకుడు మోటార్‌సైకిల్‌పై నుంచి దిగి పదునైన ఆయుధంతో కోల్హే మెడపై పొడిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సంకేత్ అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Back to top button