International

భారత్ కు చెందిన విగ్రహాలను తిరిగి ఇచ్చేయనున్న ఆస్ట్రేలియా

నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన 14 కళాఖండాలను భారత ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. భారత్ కు తిరిగి పంపబడుతున్న 14 కళాఖండాలలో ఆరు కాంస్య శిల్పాలు, ఊరేగింపు చేసే శిల్పాలు, పెయింటింగ్ చేసిన ఆరు ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఈ కలెక్షన్ విలువ సుమారు $ 2.2 మిలియన్లు (సుమారు రూ. 16.34 కోట్లు). వాటిలో కొన్ని 12 వ శతాబ్దానికి చెందినవి. వీటిలో చాలా వరకూ దొంగిలించబడిన విగ్రహాలేనని తెలుస్తోంది. భారత్ నుండి దొంగతనం చేయబడి.. పలు మార్గాల్లో ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి ఈ విగ్రహాలు. అవి భారత్ కు చెందినవేనని మన ప్రభుత్వం వాదించడంతో ఆస్ట్రేలియా తిరిగి ఇచ్చేయాలని అనుకుంటూ ఉంది.

మన దేశానికి చెందిన అపురూప కళాఖండాలను ఆస్ట్రేలియా తిరిగిచ్చేయాలని నిర్ణయించింది. త్వరలోనే 14 కళాఖండాలను భారత్ కు అప్పగించేస్తామని ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ తాజాగా ప్రకటించింది. అందులో ఆరు కళాఖండాలను దొంగిలించి ఉంటారని లేదా అక్రమ రవాణా చేసి ఉండొచ్చని గ్యాలరీ తెలిపింది. ఆ కళాఖండాలన్నీ కూడా 12వ శతాబ్దం నాటివని నిపుణులు చెబుతున్నారు. ఆ కళాఖండాలన్నింటినీ భారత్ కు తిరిగిచ్చేస్తామని ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ నిక్ మిజెవిచ్ చెప్పారు. న్యాయపరమైన చిక్కులను తొలగించామని అన్నారు. ఆసియా నుంచి వచ్చిన మరో మూడు విగ్రహాల గురించి కూడా ఆరా తీస్తున్నామన్నారు. ప్రపంచంలోని ఆర్ట్ గ్యాలరీలకు ఇదొక సమస్య అనీ, తాము కాలానుగుణంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. 13 కళాఖండాలను మాన్ హాటన్ లో విగ్రహాల డీలింగ్ చేసే సుభాష్ కపూర్ అనే స్మగ్లర్ విదేశాలకు అమ్మాడు. అమెరికా దర్యాప్తు సంస్థ అతడిపై ‘ఆపరేషన్ హిడెన్ ఐడల్’ పేరిట దర్యాప్తు చేసింది. కోర్టులో విచారణ కూడా జరగనుంది. తమిళనాడులో చోళుల కాలం నాటి 11, 12వ శతాబ్దపు హిందూ దేవతల విగ్రహాలను సుభాష్ కపూర్ అక్రమ రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. 2011లో అతడిని అరెస్ట్ చేసిన తర్వాత అమెరికా వందలాది కళాఖండాలను తిరిగిచ్చింది. ఆస్ట్రేలియా నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఇప్పటికే దొంగిలించి విదేశాలకు అక్రమ రవాణా చేసిన నృత్య భంగిమలో ఉన్న శివుడి కాంస్య విగ్రహాన్ని తిరిగిచ్చేసింది. తమిళనాడులోని గుడి నుంచి చోరీకి గురైన ఆ విగ్రహం విలువ సుమారు రూ.37.13 కోట్లు (50 లక్షల డాలర్లు) ఉంటుందని అంచనా. నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

ఆస్ట్రేలియాలోని భారత హైకమిషనర్ మన్‌ప్రీత్ వోహ్రా అపురూప కళా ఖండాలను తిరిగి భారతదేశానికి అప్పగించాలని ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం భారత్ తో స్నేహానికి ప్రతీక అని.. ఇందుకు భారతదేశం కృతజ్ఞతలు తెలుపుతుందని వోహ్రా అన్నారు. ఇవి అత్యుత్తమమైనవని, భారత్ కు చేరుకున్న తర్వాత ప్రభుత్వం, భారత ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని వోహ్రా చెప్పుకొచ్చారు.

ఆస్ట్రేలియన్ ప్రభుత్వం నవంబర్ 2019 లో మూడు సాంస్కృతికంగా ముఖ్యమైన కళాఖండాలను భారత్ కు తిరిగి ఇచ్చేసింది. తమిళనాడుకు చెందిన ఒక జత ‘ద్వారపాలకుల’ విగ్రహాలు, రాజస్థాన్ లేదా మధ్యప్రదేశ్ కు చెందిన ‘నాగరాజు (పాము రాజు)’ విగ్రహాలను భారత్ కు తిరిగి ఇచ్చేసింది. స్మగ్లర్ సుభాష్ కపూర్ నుండి వీటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా ఎన్నో వందల అమూల్యమైన పురాతన విగ్రహాలు, కళాఖండాలు భారతదేశం నుండి అక్రమంగా రవాణా చేయబడ్డాయి. అనేక ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీలు, వేలం వేసే సంస్థలు మధ్యవర్తులు, స్మగ్లర్ల ద్వారా ఇటువంటి వస్తువులను అందుకున్నట్లు తెలిసింది. వీటి విలువ ఎన్నో కోట్ల రూపాయలు. చాలా విగ్రహాలను తిరిగి భారత్ కు తీసుకుని రావడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − six =

Back to top button