ఇస్రో నిసార్.. ది స్పేస్ వారియర్..!

0
680

25 ఏళ్ల శాస్త్రవేత్తల కృషి. ఇస్రో, నాసా సంయుక్త శ్రమ ఫలితం. అదే నిసార్ ఉపగ్రహం. ఇస్రోతో జతకట్టిన నాసా జెట్ ప్రపొల్షన్ లాబొరేటరీ ఈ ప్రతిష్టాత్మక ఉపగ్రహాన్ని అభివృద్ధి చేసింది. వచ్చే 2022 డిసెంబర్ లో గానీ, లేదా 2023 జనవరిలో గాని అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న ఈ పవర్ ఫుల్ శాటిలైట్.. అంతరిక్ష చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. నిసార్ శాటిలైట్ కెపాసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కేవలం 90 నిమిషాల్లో భూమిని చుట్టేయగల సామర్థ్యం.. 12 రోజుల్లో భూమి ప్రతి అంగుళాన్ని పరీక్షించగల సత్తా దీని సొంతం. నాసా ప్రపొల్షన్ లాబొరేటరీలో ప్రాజెక్ట్ ఇంజనీర్, నిసార్ ప్రాజెక్ట్ లో మిషన్ ఇంటర్ ఫేస్ మేనేజర్ అయిన.. ఇండో అమెరికన్ శాస్త్రవేత్త అలోక్ ఛటర్జీ.. తాజాగా ఈ ప్రతిష్టాత్మక శాటిలైట్ గురించి మీడియాతో అనేక విషయాలు పంచుకున్నారు.

నిసార్.. ప్రపంచంలోకెల్లా అత్యంత క్లిష్టమైన గ్లోబల్ మిషన్. పర్యావరణ మార్పుల విషయంలో ప్రపంచ గతిని మార్చే ఆయుధం. పర్యావరణంలో నిత్యం అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అంతేకాదు, మానవ తప్పిదాల కారణంగా కూడా పర్యావరణం గతితప్పుతున్న రోజులివి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించగల పవర్ ఫుల్ శాటిలైట్ నిసార్. ఇది మునుపెన్నడూ చూడని ఓ వినూత్నమైన ఉపగ్రహం. దీనిద్వారా భూమిపై ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. భూ ఉపరితల ప్రాంతాలు, కొండలు, లోయల్నే కాదు, సముద్రాలను సైతం వడబోయగల సామర్థ్యం నిసార్ సొంతం. నిసార్ ఉపగ్రహం అందించే సమాచారం ద్వారా ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని.. దీని ఫలితాల ఆధారంగా పర్యావరణవేత్తలు తమ పాలసీలను మార్చుకోవచ్చు. భూ ఉపరితలంపై 0.4 అంగుళాల కంటే చిన్న​ వైశాల్యం గల ప్రాంతంలో కూడా సంభవించే మార్పులను నిసార్ పసిగట్టగలదు. ఇందుకోసం ఈ శాటిలైట్ లో ఎల్​ బ్యాండ్​, ఎస్​ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తున్నారు. ఇలా రెండు ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తున్న మొట్టమొదటి శాటిలైట్​ మిషన్​ ‘నిసార్’​ మాత్రమే. ఈ ప్రయోగంలో భాగంగా స్పేస్​ క్రాఫ్ట్ బస్​, ఎస్​ బ్యాండ్​ రాడార్​, ల్యాండ్​ వెహికిల్​, నిసార్​ లాంచ్​కు కావల్సిన ఇతర సేవలను కూడా ఇస్రోనే అందిస్తుంది. ఎల్​ బ్యాండ్​ సార్​, కమ్యూనికేషన్​ కోసం సైన్స్​ డేటా సబ్​ సిట్టమ్​, అత్యంత భద్రంగా ఉండే రికార్డర్​, పేలోడ్​ డేటా సబ్​ సిస్టమ్​లను నాసా సమకూర్చుతుంది.

ఇక, నాసా ఓపెన్ సోర్స్ పాలసీ ప్రకారం నిసార్ ఉపగ్రహం తీసే ఛాయాచిత్రాలను ఆర్నెళ్లలోగా ప్రపంచ దేశాలన్నింటితోనూ పంచుకోవచ్చు. కేవలం 90 నిమిషాల్లో భూమిని చుట్టేయగల సామర్థ్యం వుండటం వలన.. శాస్త్రవేత్తలు పర్యావరణ మార్పులను ఎప్పటికప్పుడు అంచనావేయగలరు. ఉదాహరణకు భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, భూమి స్థానభ్రంశం చెందడం వంటి ప్రమాదాలను ముందే పసిగట్టి ముప్పు నుంచి బయటపడొచ్చు. అంతేకాదు, ఈ అత్యాధునిక ఉపగ్రహం అందించే విలువైన సమాచారం ద్వారా ప్రపంచ దేశాలు తమ ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. వ్యవసాయం, అడవుల పెంపకం వంటి విషయాల్లో ప్రపంచదేశాలు ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది.

నిసార్ శాటిలైట్ రాత్రిరాత్రి సిద్ధం కాలేదు. దీనివెనుక 25 ఏళ్ల శాస్త్రవేత్తల కృషి దాగివుంది. ఏ దేశం కూడా చేయని సాహసాన్ని భారత్, అమెరికా కలిసి చేశాయి. ఇలాంటి ప్రాజెక్టులు కొన్ని దేశాలు చేపట్టినా.. అవి స్థానిక అవసరాలు తీర్చడానికే తప్ప.. ప్రపంచానికి విస్తృత సేవలందించేలా ఇలాంటి అత్యాధునిక ఉపగ్రహాన్ని రూపొందించడం ఇస్రో, నాసాలకే సాధ్యమైంది. ఎర్త్​ అబ్జర్వేషన్​ శాటిలైట్​ మిషన్​ కోసం హైరిజల్యూషన్​ చిత్రాలు తీసేందుకు సింథటిక్​ అపెర్చర్​ రాడార్ ​ను ఇస్రో విజయవంతంగా అభివృద్ధి చేసింది. దీనిని షార్ట్ కట్ లో సార్ అని పిలుస్తారు. అయితే, అమెరికాకు చెందిన నాసా, భారత్​కు చెందిన ఇస్రో కలిసి ఉమ్మడిగా ఈ ప్రాజెక్టు చేపట్టినందువల్ల.. ఆ రెండు పేర్లు కలిసి వచ్చేలా ఈ శాటిలైట్ ప్రాజెక్టుకు ‘నిసార్’​ అనే పేరు పెట్టారు. నిసార్​ ప్రయోగానికి సంబంధించి నాసా, ఇస్రోల మధ్య 2014 సెప్టెంబర్‌ 30న భాగస్వామ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం శాటిలైట్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు సిద్ధమైంది.

ఇదిలావుంటే, అంతకంతకూ మితిమీరిపోతున్న చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు.. అమెరికా, భారత్​, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి ‘చతుర్భుజ’ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్వాడ్ భాగస్వామ్య దేశాలు రక్షణ రంగంలోనే కాకుండా అంతరిక్ష రంగంలోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. వాతావరణ మార్పుల నియంత్రణతో పాటు, భవిష్యత్​ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో.. అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్​ అండ్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ నాసా.. సంయుక్తంగా చేపట్టిన నిసార్ ప్రాజెక్టుకు క్వాడ్ కూటమితో మరింత బలం చేకూరినట్టయింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here