భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు తక్కువ సమయంలో ముగించినా.. ప్రభావం మాత్రం చాలానే ఉంటుంది. తక్కువ సమయంలో మోదీ అమెరికా పర్యటన ఎక్కువ ఇంపాక్ట్ ను కలిగించింది. అటు అమెరికాకు భారత్ మరింత దగ్గరవ్వగా.. పాకిస్తాన్ కు వెళ్లాల్సిన వార్నింగ్ కూడా వెళ్ళింది. ఇక ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగొచ్చారు. మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగారు. ఎంతో బిజీ షెడ్యూల్ ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.
అమెరికా పర్యటనలో భాగంగా ఆయన 65 గంటల్లో 20కి పైగా సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 65 గంటల్లో అమెరికా గడ్డపై 20 సమావేశాల్లో ఆయన పాల్గొన్నారంటే ఆయన డెడికేషన్ ను మనం అర్థం చేసుకోవచ్చు. విమానంలోనూ ఆయన నాలుగు మీటింగ్స్‌లో పాల్గొనడంతో మొత్తం సమావేశాల సంఖ్య 24కు చేరింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సహా పలువురు కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు. క్వాడ్ సదస్సులో కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 22న మోదీ ప్రయాణం మొదలైంది. విమానంలో ప్రధాని మోదీ రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో దిగిన వెంటనే మరో మూడు భేటీలు జరిగాయి. 23న అమెరికాలోని ఐదు కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగాతోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ తర్వాత తన అంతర్గత టీమ్‌తో మోదీ మరో మూడు సమావేశాలు నిర్వహించారు. 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు క్వాడ్ సమావేశంలో పాల్గొనే ముందు మరో నాలుగు అంతర్గత సమావేశాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ నెల 25న ఇండియాకు తిరిగి రావడానికి విమానంలో ఎక్కిన ఆయన మరో రెండు సుదీర్ఘ సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ పర్యటన ముగిసిన తర్వాత కూడా ఆయన ఏ మాత్రం రెస్ట్ తీసుకోలేదు. అమెరికా నుంచి రాగానే నేరుగా సెంట్రల్ విస్టా పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా, సెక్యూరిటీ లేకుండానే ఆయన అక్కడికి చేరుకున్నారు. రాత్రి 8.45 గంటలకు సందర్శించి గంట సేపు గడిపారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు సెంట్రల్ విస్టాను కలిపేందుకు చేపట్టిన ప్రాజెక్టు ఈ ఏడాది నవంబర్ కల్లా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీని నిర్మాణాన్ని చేపట్టింది.