సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్ మామూలుగా ఉండదు. తాజాగా ఇంటర్‌నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన భారతీయుల్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ప్రముఖ సెర్చ్ ఇంజన్ యాహూ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. 2021లో దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వ్యక్తుల జాబితాను యాహూ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. 2017 నుంచి క్రమం తప్పకుండా ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తూ వచ్చారు. గతేడాది దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొదటి స్థానంలో నిలిచారు.
యాహూ విడుదల చేసిన జాబితాలో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. కోహ్లీ ఈ ఏడాది టీ20 ఫార్మట్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఇటీవల గుండె పోటుతో హఠాన్మరణం పొందిన బాలీవుడ్ ప్రముఖ టీవీ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా నాలుగో స్థానంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి, అనంతరం విడుదలైన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యాన్ ఖాన్ ఈ ఏడాది ఎక్కువ సెర్చ్ చేసిన వారి జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.
మగ సెలెబ్రిటీలలో టాప్ సెర్చ్ వీరే:
ఇద్దరు ప్రముఖ నటులు సిద్ధార్థ్ శుక్లా, కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు ఇంటర్నెట్‌లో వారి గురించి వెతుకుతున్నారు. 2021లో భారతదేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పురుష సెలబ్రిటీ టైటిల్‌ను సిద్ధార్థ్ శుక్లా కైవసం చేసుకోగా, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ సెలబ్రిటీల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తెలుగు నటుడు అల్లు అర్జున్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. 5వ స్థానంలో దిలీప్ కుమార్ ఉన్నారు. ఆయన 98 సంవత్సరాల వయస్సులో ఈ ఏడాది మరణించారు.
ఎక్కువగా సెర్చ్ చేసిన మహిళా సెలబ్రిటీలు:
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 2021లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన మహిళా సెలబ్రిటీగా నిలిచింది. సూర్యవంశీ సినిమా విజయం, నటుడు విక్కీ కౌశల్‌తో రిలేషన్ షిప్ కారణంగా కత్రినా కైఫ్ 2వ స్థానంలో నిలిచింది. ప్రియాంక చోప్రా జోనాస్ మూడో స్థానంలో ఉండగా, అలియా భట్ నాలుగో స్థానంలో, దీపికా పదుకొణె 5వ స్థానంలో నిలిచారు. సమంత 10వ స్థానంలో ఉన్నారు.