పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. విపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్లు

0
834

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక మొదలవ్వడమే ఆలస్యం.. విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగాయి. వారి ఆందోళ‌న మ‌ధ్యే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఆయన ప్రసంగానికి అడుగడుగునా విపక్షాలు అడ్డుతగిలాయి. ప్రతిపక్షాలు కఠిన ప్రశ్నలను ఎన్నైనా సంధించొచ్చని, వాటికి జవాబు చెప్పేందుకు ప్రభుత్వాన్ని మాట్లాడనివ్వాలని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అందరు ఎంపీలు, అన్ని విపక్షాలు అత్యంత కఠినమైన, తెలివైన ప్రశ్నలను సంధించాలని కోరుతున్నానన్నారు. ఈరోజు సభలో చాలా ఉత్సాహ పూరిత వాతావరణం ఉంటుందని అనుకున్నానని. ఈసారి చాలా మంది మహిళలు, దళితులు, గిరిజనులు మంత్రులు అయ్యారు. వ్యవసాయం, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వారు, OBC కమ్యూనిటీ వారికి మంత్రి పదవులు దక్కాయి అని అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్నాయి. దేశంలో మహిళలు, OBCలు, రైతుల కొడుకులు మంత్రులు అయితే కొంత మందికి నచ్చదు కాబోలు. అందుకే వాళ్లు కనీసం మంత్రులను పరిచయం చెయ్యడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు అంటూ ఆ ఆందోళనల మధ్యే కొత్త మంత్రులను లోక్‌సభకు పరిచయం చేశారు మోదీ.

వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ బయట మోదీ మీడియాతో మాట్లాడారు. సభలో క్రమశిక్షణతో మెలగాలని ప్రతిపక్ష సభ్యులకు హితవు చెప్పారు. ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని ఆయన చెప్పారు.కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారంతా బాహుబలులేనని.. టీకాను భుజాలకు (బాహువు) వేస్తారు. కాబట్టి, టీకాలేసుకున్న వారంతా బాహుబలులు. ఇప్పటికే 40 కోట్ల మంది బాహుబలులయ్యారు. మిగతా వారూ టీకా తీసుకుని బాహుబలి అవ్వాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు.

ఇటీవల జ‌రిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన న‌లుగురు కొత్త సభ్యులు లోక్‌సభలో ప్రమాణం చేశారు. తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ ఎంపీ డాక్టర్‌ గురుమూర్తి లోక్‌సభలో ప్రమాణం చేశారు. ఈ రోజు లోక్‌సభలో ది ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ ప్రెన్యూర్షిప్, మేనేజ్‌మెంట్ బిల్లుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ స‌మావేశాలు ఆగస్టు 13వరకు జ‌రుగుతాయి. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది చాలా బాధాకరమని.. దురదృష్టకరం… కనీసం ప్రధాని తన కొత్త మంత్రుల్ని పరిచయం చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. సభలో విపక్షాల ఆందోళనలు ఎక్కువవ్వడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 2 =