భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. త్రివర్ణ పతాకాలు చేబూనిన ఎన్నారైలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి సమావేశం, క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు దేశాల మధ్య సమగ్రమైన వాణిజ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి సమీక్షించనున్నట్లు పర్యటనకు ముందు మోదీ తెలిపారు. అమెరికా పర్యటన ద్వారా వ్యూహాత్మక బంధాన్ని బలోపేతం చేయనున్నట్లు తన ట్వీట్‌లో చెప్పారు. అధ్యక్షుడు బైడెన్, ఆసీస్ ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని మోషిహిడే సుగాలతో మోదీ భేటీ అవుతారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు స్కాట్ మారిసన్, సుగాలతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నట్లు ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్తాన్ వాయు మార్గం ద్వారా వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ రూట్‌లో మోదీ ప్రయాణించే విమానం వెళ్ళలేదు. ప్రధాని విమానం తమ మార్గం ద్వారా వెళ్లేందుకు పాక్ అనుమతి ఇచ్చినట్లు కూడా అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రూట్‌లో కమర్షియల్ ఫ్లయిట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో పాక్ వాయుమార్గం ద్వారా ప్రధాని మోదీ విమానం వెళ్లింది. ప్రధాని మోదీతో పాటు ఎన్ఎస్ఏ సలహాదారుడు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగాల్, ఇతర ప్రభుత్వ అధికారులు వెళ్లారు. బోయింగ్-777 విమానంలో ఢిల్లీలోని వైమానికదళ ఎయిర్‌బేస్ నుంచి ఆ విమానం ఎగిరింది. వీవీఐపీలను అమెరికాకు తరలించేందుకు బోయింగ్-777 విమానాలను వాడుతుంటారు. ఉగ్రవాద నిర్మూలన, ఆఫ్ఘన్ లోని ప్రస్తుత పరిణామాలు, రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపైనా చర్చిస్తారు. పర్యటన ముగించుకుని ఈ నెల 26న తిరిగి స్వదేశానికి వస్తారు.