కిడాంబి శ్రీకాంత్ పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ

0
908

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్ ఆటగాడు లో కీన్‌యూ చేతిలో 21-15, 22-20 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఈ పతకంతో శ్రీకాంత్ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న తొలి భారతీయ షట్లర్‌గా రికార్డులకెక్కాడు. ఈ గేమ్‌లో శ్రీకాంత్ తీవ్రంగా పోరాడినప్పటికీ ప్రత్యర్థి కీన్ యూ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశాడు. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో లో కీన్‌ యుపై వరుస గేముల్లో గెలిచిన 28 ఏళ్ల శ్రీకాంత్‌ ఈసారి మాత్రం ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. సెమీస్‌లో కిడాంబి చేతిలో ఓడిన లక్ష్యసేన్‌ ఇప్పటికే కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. కీన్‌ యూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ గా నిలిచిన తొలి సింగపూర్‌ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న లో కీన్‌ యు విశ్వవిజేతగా నిలిచిన క్రమంలో అద్భుత విజయాలు అందుకున్నాడు. తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)ను, సెమీఫైనల్లో మూడో ర్యాంకర్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)పై, ఫైనల్లో మాజీ వరల్డ్‌ నంబర్‌వన్‌ శ్రీకాంత్‌పై విజయాలను అందుకున్నాడు.

ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 43 నిమిషాల్లో 15–21, 20–22తో అన్‌సీడెడ్, ప్రపంచ 22వ ర్యాంకర్‌ లో కీన్‌ యు (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో శ్రీకాంత్‌ రజత పతకం సొంతం చేసుకోగా… లో కీన్‌ యు స్వర్ణ పతకం దక్కించుకొని కొత్త ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. సెమీఫైనల్లో ఓడిపోయిన లక్ష్య సేన్‌ (భారత్‌), ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)లకు కాంస్య పతకాలు లభించాయి.

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక రజత పతకం సాధించిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు.బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ప్రకాష్ పదుకొణె (1983), బి సాయి ప్రణీత్ (2019), లక్ష్య సేన్ (2021) కాంస్యం గెలుచుకోగా.. ప్రపంచ మాజీ నంబర్ 1 శ్రీకాంత్ రజతం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

శ్రీకాంత్ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కిడాంబి శ్రీకాంత్ ఆట తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton,” అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.