More

    తెలుగు రాష్ట్రాల విభజనపై కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డ ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో ఆయన మాట్లాడారు. ఇప్పటిదాకా చేసిన తప్పులను సరిదిద్దుకుని వందో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశ పురోగతికి కావాల్సిన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మహాత్మా గాంధీనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వద్దన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అనేదే లేకుంటే ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. సిక్కుల ఊచకోత జరిగేది కాదు. అవినీతి అన్నదే భారత్ లో ఉండకపోయేది. కశ్మీరీ పండిట్ల వలసలు జరిగేవి కాదు. ఆడబిడ్డలు క్షేమంగా ఉండేవారు. ప్రజలందరికీ కనీస వసతులు వచ్చేవని అన్నారు. 1955లో గోవాలో పాదయాత్ర చేస్తున్న సత్యాగ్రహిల మరణానికి జవహర్ లాల్ నెహ్రూనే కారణమన్నారు. అంతర్జాతీయంగా తన ఇమేజ్ ను కాపాడుకునేందుకు గోవాను వదిలేశారని.. కాంగ్రెస్ కు చాలా విషయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మొత్తం ఇప్పుడు అర్బన్ నక్సలైట్లతో నిండిపోయిందన్నారు.

    రాష్ట్రాలు పురోగమించినప్పుడే దేశం పురోగమిస్తుందన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రులను అవమానించారని అన్నారు. బడ్జెట్ లో తాము పన్నులను పెంచలేదని మోదీ గుర్తు చేశారు. భారత సాంప్రదాయ ఔషధాలను విదేశాల్లో గుర్తిస్తున్నారన్నారు. ఇప్పటికే దేశంలో 80 వేల ఆరోగ్య కేంద్రాలను ఆయుష్ ఆధ్వర్యంలో నిర్మించామన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో 23 సార్లు కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశమయ్యానని ఆయన గుర్తు చేశారు. వ్యాక్సిన్లకు ఖర్చు చేస్తున్న డబ్బులన్నీ వృథా అని ఓ ఎంపీ అన్నారన్నారు. అసలు ప్రతిపక్షాలకు వ్యాక్సినేషన్ విషయంలో భారత్ సాధించిన గొప్ప విజయంపై కనీస గౌరవం కూడా లేదన్నారు. గత ఏడాది ఐటీ రంగంలో 27 లక్షల ఉద్యోగాలను కల్పించామని అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత నియామకాలు రెట్టింపయ్యాయన్నారు. ప్రస్తుతం రక్షణ రంగంలోకి ఎంఎస్ఎంఈలూ ప్రవేశిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్ అని, అందులోనూ ఎంఎస్ఎంఈలే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. స్టార్టప్ ల ఏర్పాటులో దేశాన్ని ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిపారన్నారు. క్రీడల్లో రాణిస్తున్నారని ప్రశంసించారు.

    తెలంగాణను తామే ఏర్పాటు చేశామని కాంగ్రెస్ క్రెడిట్ తీసుకున్నా, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించలేదని, ఎన్నికల్లో ఓడగొట్టారని లోక్ సభ ప్రసంగంలో చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాజ్యసభలో మాట్లాడుతూ అధికారం అనే మత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ప్రధాని ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించారని, కనీసం చర్చ కూడా జరగకుండా విభజన బిల్లును కాంగ్రెస్ ఆమోదించిందని, దాని పర్యవసానాల వల్ల ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని మోదీ అన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకి కాదన్న మోదీ.. ఏపీ విభజన మాత్రం సరైన పద్దతిలో జరగలేదన్నారు. తెలంగాణ- ఏపీల మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని విమర్శించారు. అవతలివాళ్లకు అపఖ్యాతి ఆపాదించడం, దేశంలో అస్థిరత నెలకొల్పడం, మంచిని తొలగిండం అనే మూడు విధానాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహాలని మోదీ మండిపడ్డారు.

    Trending Stories

    Related Stories