National

రామప్పకు యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ కృషికి ప్రశంసలు..!

తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప చరిత్ర సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాబితాలో చేర్చేందుకు నార్వే వ్యతిరేకించినా, రష్యా సహా 17 దేశాలు ఆమోదం తెలిపాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించేందుకు 9 లోపాలున్నట్టు యునెస్కో బృందం తెలిపింది. దౌత్య పద్ధతుల్లో 24 దేశాలకు రామప్ప ఆలయ విశిష్టతలను వివరించింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో రూల్ 22.7ను ప్రయోగించి రామప్పను నామినేషన్‌లలో పరిగణలోకి తీసుకునేలా రష్యా చేసింది.

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించడం పట్ల భారతప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యటకులు సందర్శించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. “అద్భుతమైన విషయం! అందరికీ.. ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం యొక్క అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ గొప్ప ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనం గురించి తెలుసుకోవాలని నేను మీ అందరిని కోరుతున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.

తెలంగాణలోని రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా ఎంపికవడం పట్ల సీఎం కేసీఆర్ స్పందించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాకతీయ రాజుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం దేశంలోనే ప్రత్యేకమైనదని.. కాకతీయ రాజులు సృజనశీలురని, వారి కాలంలో నిర్మితమైన ఆలయాలు చెబుతున్నాయని వివరించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప గుడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కృషి చేశారంటూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. యునెస్కో సమావేశంలో భారత్ కు మద్దతు పలికిన ఇతర సభ్య దేశాలకు కూడా సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

రామప్ప గుడికి యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు ఇవ్వడం పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలయం కాకతీయ శిల్ప కళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. 2020 సంవత్సరానికి మన దేశంలో ఈ ఒక్క కట్టడానికే గుర్తింపు దక్కిందని, తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తొలి కట్టడం రామప్ప గుడి అని వెంకయ్య నాయుడు వివరించారు. ఇది తెలుగు వారందరూ గర్వించదగిన విషయం అని తెలిపారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ రామప్ప గుడికి ఇంతటి గొప్ప గుర్తింపు దక్కడం కోసం సభ్యదేశాలతో ఏకాభిప్రాయం సాధించడానికి ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని వెల్లడించారు. ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుని, సత్వర చర్యలు చేపట్టారని ప్రశంసించారు. అన్ని దేశాల ఏకాభిప్రాయంతోనే ఇది సాధ్యమైందని.. తెలంగాణ చారిత్రక గొప్పదనాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ఘనత మోదీ సర్కారుదేనని బండి సంజయ్ తెలిపారు. రామప్ప గుడికి ఇంతటి ఘనతర గుర్తింపు లభించడంలో తోడ్పాటు అందించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయమంత్రి మీనాక్షి లేఖిలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణలోని రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం హర్షణీయమని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం ఆనందాన్నిస్తోందని.. తెలంగాణ నుంచి ఇదే తొలి ప్రపంచ వారసత్వ కట్టడం అని వెల్లడించారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తమ తదుపరి లక్ష్యం అని చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × two =

Back to top button