National

పునీత్ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. కళ్లను దానం చేశారట

పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. రాజ్ కుమార్ తన మరణం తర్వాత కూడా ఈ ప్రపంచాన్ని చూడనున్నారు. ఆయన కళ్లను దానం చేయనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. గతంలో పునీత్ తండ్రి రాజ్ కుమార్ చనిపోయినప్పుడు కూడా ఆయన కళ్లను మరొకరి కోసం కుటుంబీకులు దానం చేశారు. 1975 మార్చి 17న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్-పార్వతమ్మ దంపతుల మూడో సంతానంగా పునీత్ జన్మించారు. అందరూ అభిమానంగా అప్పూ అని పిలుచుకునే పునీత్ చిన్న నాటి నుంచే సినిమాల్లో నటిస్తూ మెప్పించి కన్నడ పవర్ స్టార్ గా ఎదిగారు. హీరోగా తన కెరీర్లో 29కి పైగా చిత్రాల్లో నటించారు. 2002లో వచ్చిన అప్పు చిత్రం హీరోగా పునీత్ కు తొలి చిత్రం. అభి, వీర కన్నడిగ, అజయ్, హుదుగారు, అంజనీపుత్ర, రామ్, అరసు చిత్రాలు పునీత్ కెరీర్లో భారీ హిట్లు. పునీత్ చివరిగా నటించిన చిత్రం యువరత్న. ఇది ఈ ఏడాది ఆరంభంలో రిలీజైంది. పునీత్ రాజ్ కుమార్ కు 1999లో అశ్విని రేవంత్ తో వివాహం జరిగింది. వీరికి ధృతి, వందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిచ్చే పునీత్ గుండెపోటుకు గురికావడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పునీత్ మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ఉన్న ఫోటోను మోదీ పంచుకున్నారు. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ చనిపోవడం బాధాకరమైన అంశమని మోదీ అన్నారు.

https://twitter.com/narendramodi/status/1454042013813313540/photo/1

పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదానికి గురిచేసింది. చిరంజీవి, మహేశ్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని చిరంజీవి పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర రంగానికి పునీత్ మరణం పెద్ద లోటు అని పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.

మహేశ్ బాబు స్పందిస్తూ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషాదవార్త చూసి షాక్ కు గురయ్యానని, తీవ్ర విచారం కలుగుతోందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని వివరించారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. పలువురు దక్షిణాది నటులు, బాలీవుడ్ నటులు పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Back to top button