More

    సెంట్రల్ విస్టాపై విమర్శలు చేస్తున్న వారిపై ప్రధాని మోదీ భారీ కౌంటర్లు

    నూతన పార్లమెంట్ భవన సముదాయం సెంట్రల్ విస్టాపై విమర్శలు చేస్తున్న వారిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ శాఖలో కొత్త కాంప్లెక్స్ లకు శంకుస్థాపన చేసిన ఆయన.. కీలక మంత్రిత్వ శాఖలు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాల పరిస్థితి కన్నా కొందరికి వ్యక్తిగత అజెండాలే ముఖ్యమైపోయాయని ప్రధాని మోదీ విమర్శించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేశారని, అలాంటి వారు ప్రభుత్వ కీలక శాఖల కార్యాలయాల పరిస్థితి గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. రక్షణ శాఖ కార్యాలయాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని నిలదీశారు. ఒకవేళ వారు మాట్లాడితే వారి అబద్ధాలు బయటపడేవన్నారు. అధికారులు నివసించేందుకు వీలుగా సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్, ఆఫ్రికా అవెన్యూలో 7 వేల గృహాలతో కొత్తగా రెండు రక్షణ శాఖ కాంప్లెక్స్ లను నిర్మించబోతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. 50 ఎకరాల్లో ఇప్పుడున్న 700 కొట్టాలను కూల్చేసి ‘ఎగ్జిక్యూటివ్ ఎన్ క్లేవ్’గా నిర్మిస్తామన్నారు. వాస్తవానికి వాటిని గుర్రాల కోసం కట్టారని మోదీ గుర్తు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఆ కొట్టాల్లోనే ఆర్మీ అధికారులుంటున్నారంటే తనకు ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. ఆ పరిస్థితిని తాము మార్చేస్తామని, ఆధునిక హంగులతో ఎన్ క్లేవ్ లను నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఇదంతా కూడా సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగమేనన్నారు. తప్పుడు ప్రచారం చేసేవారికి ఈ విషయాలెన్నటికీ అర్థం కావన్నారు.

    ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌‌లను ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌లపై దృష్టి పెట్టినపుడు, ఆధునిక మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో జరుగుతున్నది ఇదేనని.. డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌లో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు ఉన్నాయని, ఆధునిక సదుపాయాలు ఉంటే మరింత మెరుగ్గా పని చేయడానికి త్రివిధ దళాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు. డిఫెన్స్ ఆఫీసెస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం 12 నెలల్లో పూర్తయిందన్నారు. కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ కార్యకలాపాలు జరిగాయని, దీనివల్ల మహమ్మారి సమయంలో వందలాది మంది కూలీలకు ఉపాధి దొరికిందని చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోనే పూర్తవుతుందని చెప్పారు. ఈ నూతన కార్యాలయాల్లో దాదాపు 7,000 మంది అధికారులు పని చేస్తారు.

    ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించనుంది మోదీ ప్రభుత్వం. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం,కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3కి.మీ రాజ్‌పథ్‌ పునరుద్దరణ చేపట్టనున్నారు. అలాగే పలు నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించనున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో త్రిభుజాకారంలో నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే ఇది చాలా పెద్దది. ఇందులో లోక్‌సభ సుమారు 888 సీట్లు, రాజ్యసభ 384 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉభయ సభల్లో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. భవిష్యత్తులో దేశంలో లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉన్నందునా… ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉండేలా పార్లమెంటు నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత లోక్‌సభలో 545 సీట్లు,రాజ్యసభలో 245 సీట్లు ఉన్నాయి. లోక్‌సభ సెక్రటేరియట్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, సిపిడబ్ల్యుడి, ఎన్‌డిఎంసి,ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ / డిజైనర్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కొత్త పార్లమెంటు భవన సముదాయం 2022 నాటికి పూర్తవుతుందని.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణం 2024 నాటికి పని పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

    Related Stories