ప్రధాని నరేంద్ర ‘మోదీ మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలోని ట్యాలెంటెడ్ వ్యక్తుల గురించి, గొప్ప పనులు చేస్తున్న వారి గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. తాజాగా తెలుగు యువకుడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. అతడు చేస్తున్న పని అమోఘమని మోదీ వెల్లడించారు.

మోదీ ప్రశంసిన వ్యక్తి మరెవరో కాదు ఏపీ వెదర్ మ్యాన్ అంటూ గుర్తింపు తెచ్చుకున్న సాయి ప్రణీత్..! ఏపీ వెదర్ మ్యాన్ పేరుతో ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలను తిరుపతి కుర్రాడు సాయి ప్రణీత్ వెల్లడిస్తూ ఉంటాడు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రణీత్ ను మోదీ ప్రశంసించారు. సోషల్ మీడియా ద్వారా వాతవరణ వివరాలను అందిస్తూ రైతులు, ప్రజలకు ఎంతో సాయపడుతున్నారని మోదీ అభినందించారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సాయి ప్రణీత్.. ఇటీవల వచ్చిన అల్పపీడనాలు, భారీ వర్షాల గురించి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేశాడు.

సాయి ప్రణీత్ తిరుపతిలో జన్మించాడు. చుట్టూ కొండలు, మేఘాలను చూస్తూ చిన్ననాటి నుంచే ఎంతో ఆనందించే వాడట. వాతావరణ పరిస్థితులపై అవగాహన తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. కాలేజీ చదివే రోజుల్లో తల్లితండ్రులు కొనిచ్చిన మొబైల్ లో ఉండే వెదర్ యాప్ అతనిని ఎంతగానో ఆకట్టుకుంది. యాప్స్ సమాచారాన్ని ఎలా సేకరిస్తాయనే విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించే వాడు. గతంలో చేసిన ఎన్నో పరిశోధనలు, మరెన్నో పుస్తకాలు చదివి చాలా సమాచారాన్ని పోగేశాడు. వాతావరణం గురించి ఆసక్తి కలిగిన మిత్రులను ఎంచుకొని ఓ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. బిటెక్ సమయంలో వాతావరణంలో మార్పులను గమనిస్తూ వాటిని అంచనా వేయసాగాడు. ‘తమిళనాడు వెదర్ మ్యాన్’ తో పరిచయం సాయి ప్రణీత్ ఇంకా చాలా విషయాలను తెలుసుకోడానికి వీలైంది. ఆ తర్వాత ఓ బ్లాగ్ ను ఏర్పాటు చేసాడు. వాతావరణ స్థితిగతులపై అంచనాను వేయడం మొదలు పెట్టాడు సాయి ప్రణీత్. బ్లాగ్ ద్వారా రోజువారీ వాతావరణ పరిస్థితులపైనే కాకుండా తుఫానుల గురించి కూడా చెప్పేవాడు. 2020 అక్టోబర్ లో తెలుగు రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షం.. హైదరాబాద్ కు వర్షం ముప్పు గురించి సాయిప్రణీత్ తన బ్లాగ్ లో పోస్ట్ చేసాడు. ఏపీ వెదర్ మ్యాన్ లోని సమాచారం కచ్చితంగా జరుగుతున్నాయి. మానవ మేధస్సుతో పాటుగా అంతరిక్ష్యంలో ఉపగ్రహాలు పంపే సమాచారం ఆధారారంగా భౌగోళిక పరిస్థితులు, వాతావరణ సూచనల బట్టి వాతావరణ అప్డేట్ ను ఇస్తూ ఉంటారు. ప్రణీత్ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల నుండి సమాచారాన్ని సేకరించి వాతావరణ సూచనలను ఇస్తూ ఉన్నాడు. ప్రజలకు ఉపయోగపడే వివరాలను అందిస్తూ ఉన్నాడు. రోజువారీ అప్ డేట్ నుంచి నెల వారి అప్ డేట్ వరకు ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, బ్లాగ్స్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.

అలా సాయి ప్రణీత్ గురించి ప్రధాని మోదీ దాకా వెళ్ళింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూనే సాయి ప్రణీత్ 7 ఏళ్ళుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ ఐక్యరాజ్యసమితి హ్యాబిటేట్ ప్రశంసలను కూడా అందుకున్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ సాయి ప్రణీత్ ను అభినందించడం పట్ల అతని కుటుంబం, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
