జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఒక మాదకద్రవ్యాల స్మగ్లర్‌ను బుధవారం నాడు సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సిబ్బంది కాల్చి చంపారు. అతని వద్ద నుండి 27 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హిరానగర్ సెక్టార్‌లోని సరిహద్దు అవుట్‌పోస్ట్ (బిఓపి) పన్సార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సరిహద్దు భద్రతా దళం ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిహద్దు అవతలి వైపు నుండి స్మగ్లర్ భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నట్లు బిఎస్ఎఫ్ సిబ్బంది గమనించారు. అతను వారి హెచ్చరికలను పట్టించుకోకుండా పారిపోవడానికి ప్రయత్నించగా అతనిని కాల్చారు. స్మగ్లర్ సమాచారాన్ని అధికారులు సేకరిస్తూ ఉన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కతువా ఉన్న హీరానగర్ సెక్టార్‌లో బుధవారం తెల్లవారుజామున అక్రమంగా హెరాయిన్‌ను తరలిస్తున్న వ్యక్తి కదలికలను గుర్తించిన సరిహద్దు రక్షణ దళం.. అతడిని లొంగిపోవాలని కోరినప్పట్టికీ వినకపోవడంతో కాల్చివేశారు. అనంతరం అతని వద్ద 27 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.135 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
బిఎస్ఎఫ్ జమ్మూ సరిహద్దు డిఐజి ఎస్పిఎస్ సంధు మాట్లాడుతూ “తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో, హిరానగర్ సెక్టార్లోని బిఎస్ఎఫ్ యొక్క పన్సర్ సరిహద్దు పోస్ట్ సమీపంలో బిఎస్ఎఫ్ జవాన్లు అనుమానాస్పద కదలికలను గమనించారు. బిఎస్ఎఫ్ సిబ్బంది పదేపదే హెచ్చరికలను జారీ చేసినా చొరబాటుదారుడు పట్టించుకోలేదు. చివరికి, జవాన్లు కాల్పులు జరిపి అక్కడికక్కడే చంపారు. ” అని వెల్లడించారు. హతమార్చిన పాకిస్తాన్ స్మగ్లర్ వద్ద 27 హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని.. ఈ సరుకు జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ చేస్తున్న నార్కో-టెర్రరిజంలో భాగమని వెల్లడించారు. పాకిస్తాన్ రేంజర్స్ మద్దతు లేకుండా, సరిహద్దులో ఇటువంటి కదలికలు సాధ్యం కాదని సంధు అన్నారు. ఈ ఏడాది జనవరి 23 న ట్రాన్స్-బోర్డర్ టన్నెల్ కనుగొనబడిన అదే ప్రాంతం నుండి ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నం చోటు చేసుకుందని ఎస్పిఎస్ సంధు వెల్లడించారు.
జనవరి 23 న ఈ ప్రాంతంలో పాక్ నుండి ఒక సొరంగం కనుగొనబడింది. ఈ సొరంగంను ఆరు నుండి ఎనిమిది సంవత్సరాలుగా వాడుతున్నట్లు గుర్తించారు. 150-175 మీటర్ల పొడవు ఉందని గుర్తించారు.