పలు రాష్ట్రాల్లో వినాయకచవితిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వినాయకచవితిని నిర్వహిస్తారు. ముంబై గురించి ఇక దేశమంతా చర్చించుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం వినాయకచవితిపై కఠిన ఆంక్షలను విధించింది. ఈ కఠిన ఆంక్షలపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణె స్పందించారు.
మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ ఆఘాదీ సర్కార్ హిందువులకు వ్యతిరేకం అని నారాయణ్ రాణె ఆరోపించారు. కేవలం హిందువుల పండుగల సమయంలోనే మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపణలు గుప్పించారు. ఇది తప్పని వ్యాఖ్యానించారు. హిందూత్వ గురించి మాట్లాడే శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతోనే తన సిద్ధాంతాలను మార్చేసిందని అన్నారు. “మహారాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగల సమయంలో మాత్రమే ఆంక్షలు విధిస్తోంది. ఇది తప్పు. ఇది హిందూ వ్యతిరేక ప్రభుత్వం. హిందూ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే వారు ఆంక్షల గురించి ఆలోచిస్తారు. శివసేన హిందూత్వం గురించి మాట్లాడుతుంది కానీ వారు బీజేపీతో విడిపోయిన రోజే వారి హిందుత్వం ముగిసింది ”అని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే అన్నారు.
కొద్దిరోజుల కిందట నారాయణ్ రాణే ఉద్ధవ్ ఠాక్రే పై చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే..! ‘దేశానికి స్వాతంత్య్రం ఏ సంవత్సరంలో వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటు. ఆయన ప్రసంగాన్ని మధ్యలో ఆపి వెనుక ఉన్నవారిని అడగాల్సి వచ్చింది. నేను అక్కడ ఉండి ఉంటే (ఆయన) చెంప పగులగొట్టేవాడిని’ అని రాణే వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై పలు స్టేషన్స్ లో కేసులు నమోదవ్వడం.. అరెస్టు చేయడం వంటివి చోటు చేసు చేసుకున్నాయి.