అభిమాని అత్యుత్సాహం.. పవన్ కల్యాణ్ కు తప్పిన ప్రమాదం

0
745

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల అభ్యున్నతి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయనను చూడడానికి ఎప్పటి లాగే అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎగబడ్డారు. కొందరు వీరాభిమానులు ఆయనను ఎలాగైనా తాకాలని భావించారు. రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వచ్చినప్పటి నుండి.. నరసాపురం చేరుకునే వరకు అభిమానులు భారీగా కలిసి వచ్చారు. ఈ సందర్భంగా పవన్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. తన వాహనంలోంచి పైకి లేచి నిలబడి పవన్ అభిమానులకు చేయి ఊపుతూ అభివాదం చేస్తున్నారు. ఇంతలో ఓ అభిమాని అకస్మాత్తుగా పవన్ ఉన్న వాహనంపైకి వచ్చాడు. అతడు వేగంగా దూసుకువచ్చి పవన్ ను ఢీకొట్టాడు. దాంతో పవన్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆయన కారుపైనే కూలబడడంతో ప్రమాదం తప్పినట్టయింది. అనంతరం పైకి లేచి యథావిధిగా ముందుకు సాగారు.

తన ప్రసంగం ఆరంభంలో ఏపీ ప్రభుత్వం తాను మత్స్యకారుల సభకు వస్తుండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. రోడ్లంతా గతుకులు, గొయ్యిలు తీసిపెట్టిందని, దాంతో పడవ ప్రయాణం చేసినట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. “మత్స్యకారుల సభ కాబట్టి పడవ ప్రయాణాన్ని తలపించేలా చక్కని ఏర్పాట్లు చేసింది. రోడ్లపై గోతులు తీసింది. చక్కని అభివృద్ధి! ఈ ప్రయాణంతో మాయాబజార్ చిత్రంలోని లాహిరి లాహిరి పాట గుర్తొచ్చింది” అంటూ విమర్శలు గుప్పించారు. జనసేనను బెదిరించాలని చూసే నాయకులకు ఒకటే చెబుతున్నా.. మీ పిచ్చి పిచ్చి వేషాలకు జనసేన భయపడదని స్పష్టం చేశారు. సంయమనం పాటిస్తున్నానంటే అది తమ బలం అని, బలహీనత కాదని అన్నారు. పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాలను కూడా దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తానన్నారు. మా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, హింసిస్తే రోడ్డుపై ఏ స్థాయికైనా దిగి పోరాడతానని వెల్లడించారు. మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 32 మత్స్యకార ఉపకులాలు ఉన్నాయని, రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని వెల్లడించారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసన్నారు. జనసేనకు ఒక్క పది మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ జీవో 217ని ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసి ఉండేది కాదన్నారు. ఈ జీవోతో లక్షలమంది పొట్టకొడుతున్న వైసీపీ నేతలు జీవో ప్రతులను చించివేసిన తనపై కేసులు పెట్టుకోవచ్చని సవాల్ విసిరారు. ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ అన్నారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు.