తమ సోదరిపై చేసిన వ్యాఖ్యలపై నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం

0
887

శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని, మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి.. టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కివెక్కి ఏడ్చారు. గత రెండున్నరేళ్లుగా తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు అన్నారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని.. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. సభలో ఎన్నో చర్చలు చూశామని కానీ ఇంతటి దారుణాలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎవరినీ తిట్టలేదని చంద్రబాబు అన్నారు. గతంలో రాజశేఖరరెడ్డి కూడా తన గురించి ఒక మాట మాట్లాడారని… కానీ ఆ తర్వాత మేము కలిసినప్పుడు తనకు క్షమాపణ చెప్పారని అన్నారు.

నేడు నందమూరి బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి స్పందించారు. చంద్రబాబులాంటి వారిని దూషించడం చాలా బాధకరమైన విషయమని.. మా సోదరి భువనేశ్వరీని తీసుకురావడం హేయమైన చర్యని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని.. ఇక చంద్రబాబు అనుమతి అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు సహనంగా ఉన్నామంటే చంద్రబాబు వల్లే అన్నారు.. ఆయన మొదటి నుంచి చాలా పెద్దరికంగా వ్యవహరించారన్నారు. మళ్లీ ఇలా నీచంగా మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష చూస్తే కూడా అసహ్యం వేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చోట క్యారెక్టర్‌ అస్సాసియేషన్‌ మంచిది కాదన్నారు. అసెంబ్లీ వాగ్వాదాలు మామూలే కాని వ్యక్తిగత విమర్శలకు దిగడం ప్రజాప్రతినిధుల సంస్కారం కాదన్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, రాష్ట్ర విభజన తరువాత కూడా ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశారన్నారు. కానీ ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. ఆయన ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు లేవని.. అసెంబ్లీలో ఎన్నో అంశాలపై మాట్లాడొచ్చని.. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సహజం అన్నారు. అసెంబ్లీలో మహిళ సభ్యులు కూడా ఉన్నారని ఎన్టీఆర్ హయాం నుంచి చూస్తున్నా.. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ లేవన్నారు. వ్యక్తిగతంగా ఆడవాళ్లను విమర్శించడం దారుణమని.. తన సోదరి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలతో బాధగా అనిపించిందన్నారు. ఇదంతా చూస్తుంటే గోడ్ల చావిట్లో ఉన్నామా అసెంబ్లీలో ఉన్నామా అనిపించిందన్నారు బాలయ్య. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల గురించిన ప్రస్తావన ఎందుకు.. భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఆవిడ వ్యాపారాలు చేసుకుంటున్నారే తప్ప ఏ రోజూ రాజకీయాల్లోకి రాలేదన్నారు.

ఊరికే ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు హిందూపురం ఎమ్మెల్యే. అసెంబ్లీలో చాలామంది మేధావులు ఉన్నారని.. వాళ్లు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారేమోనని బాలయ్య చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు సరికాదని.. పర్సనల్ ఎజెండాతో తమ కుటుంబ సభ్యుల్ని అవమానపరిచారన్నారు. దేనికైనా హద్దు ఉంటుంది.. ఇక ఉపేంక్షించేది లేదన్నారు. మైండ్ గేమ్ ప్లే చేస్తున్నామనుకుంటున్నారని.. పదవులు శాశ్వతం కాదు.. ఇవాళ మీరున్నారు.. రేపు మేం ఉండొచ్చని బాలకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు.